పేద రోగులకు పెద్దదిక్కు అయిన నిజామాబాద్ జిల్లా పెద్దాసుపత్రిని నీటి కష్టాలు చుట్టుముట్టాయి. ఆస్పత్రిలోని బోర్లు ఎండిపోవడం వల్ల చుక్కనీరు దొరక్క రోగులు నానాపాట్లు పడుతున్నారు. నిత్యం ఆస్పత్రికి మూడు నుంచి నాలుగు వేల మంది వస్తుంటారు. కనీసం తాగు నీరు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో కొంతమంది దాహం తీర్చుకుంటుంటే... సమీపంలో బందువులెవరైనా ఉంటే వారు తెచ్చిన నీటితో రోగులు గొంతు తడుపుకుంటున్నారు. అదీ లేకపోతే నీటిని కొనుక్కుని తెచ్చుకోవడమే శరణ్యం.
రాత్రివేళ మరీ ఇబ్బంది
పగటి సమయంలో ఏదోలా నీరు తెచ్చుకుంటున్నారుగాని... రాత్రివేళ చుక్కనీరు దొరక్క గొంతు తడారిపోతుందంటూ రోగులు వాపోతున్నారు. ఆస్పత్రిలోని ఏడో అంతస్తులో ఉన్నవారు కిందకి మీదికి తిరిగేసరికి కాళ్లు పీక్కుపోతున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. కనీసం లిప్ట్ సౌకర్యం కూడా లేదని రోగి తరఫున వచ్చే వారిలో ప్రత్యేకించి ఒకరిని నీరు మోయడానికే కేటాయించుకుంటున్నారంటే పరిస్థితి అవగతం చేసుకోవొచ్చు.
త్వరలోనే పరిష్కరిస్తాం
ఆస్పత్రిలోని నీటి కష్టాలపై ఇంజినీర్లతో చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని త్వరలోనే నీటి సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
రోగం నయంచేయించుకుందామని వస్తే ఆస్పత్రిలో నీటి కష్టాలు రోగుల నడ్డి విరిచేస్తున్నాయని. ఇప్పటికైనా నీటి కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: మరోసారి రోడ్డెక్కిన నిజామాబాద్ రైతులు