Protests in Telangana University : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఔట్ సోర్సింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. జీతాలు చెల్లించే వరకు ధర్నా విరమించేది లేదంటూ పరిపాలన భవనం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. విధులు బహిష్కరించి సిబ్బంది వంట చేయకపోవటంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. వీసీ, రిజిస్ట్రార్, పాలక వర్గాల రాజకీయాలతో తమ కడుపులు మాడుస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే విద్యార్థులు ఖాళీ ప్లేట్లతో విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం ముందు ధర్నా నిర్వహించారు. బుధవారం వీసీ హామీతో బయట నుంచి భోజనం తెప్పించిన వార్డెన్.. విద్యార్థుల మెస్ కోటా నుంచి ఖర్చులు భరిస్తేనే ఆహారం తెప్పిస్తానని నోటీసులిచ్చారు. వసతి గృహంలో ఉంటున్న వారి జాబితా ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు విద్యార్థులు వెల్లడించారు. కేటరింగ్ మెస్ ఛార్జీలు భరించలేమన్న వారు.. వెంటనే వంట ప్రారంభించేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Students Protests in Telangana University : వసతి గృహాల్లో రోజుకి రూ.60 చెల్లించే తాము.. పూటకి రూ.150 ఎలా భరిస్తామని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పొరుగు సేవలు, నాన్‌టీచింగ్ సిబ్బంది నిరసన విరమించకపోవటంతో.. విద్యార్థులు ఆహారం కోసం బిక్షాటన చేశారు. వర్సిటీ సమీపంలోని నడిపల్లి తండాలో ఆహారం అడుక్కున్నారు. డబ్బులిస్తేనే ఆహారం తెప్పిస్తామని వార్డెన్ నోటీసులివ్వటం దారుణమని వారు మండిపడ్డారు.
వీసీ, రిజిస్ట్రార్, తెలంగాణ వర్సిటీ పాలక వర్గాలు, ప్రొఫెసర్ల రాజకీయాల వల్ల తాము ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆకలి కేకలు ప్రభుత్వానికి ఎందుకు వినిపించట్లేదని వారు వాపోయారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
"మాకు భోజనాలు పెట్టడం లేదు. మూడురోజులుగా ఆకలితో అలమటిస్తున్నాం. వీసీ, రిజిస్ట్రార్, పాలక వర్గాల రాజకీయాలతో మా కడుపులు మాడుస్తున్నారు. వసతి గృహాల్లో రోజుకి రూ.60 చెల్లించే తాము.. పూటకి రూ.150 ఎలా భరిస్తాం." - విద్యార్థులు
Outsourcing Employees Protest Telangana University : గత మూడు రోజులుగా జీతాల కోసం.. తెలంగాణ యూనివర్సిటీలోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. గత నెలలో కూడా ఇలాగే జీతాల కోసం ధర్నా నిర్వహించామని అన్నారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. నెల ప్రారంభమై పదిహేను రోజులవుతున్నా జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో వంట, పారిశుద్ద్యం, ఇతర విభాగాలపై ప్రభావం పడింది. వంట చేసే సిబ్బంది విధులకు రాకుండా ఆందోళనలో పాల్గొనడంతో రెండు రోజులుగా విద్యార్థులు ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తమ సమస్యలను పరిష్కరించాలంటూ వర్సిటీకి వచ్చిన వీసీ రవీందర్‌గుప్తాను విద్యార్థులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అడ్డుకున్నారు. జీతాలు ఎప్పుడు ఇస్తారంటూ సిబ్బంది.. భోజనం ఎప్పుడు అంటూ విద్యార్థులు వీసీని నిలదీశారు.
ఇవీ చదవండి: