Telangana University Latest Updates : నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ విచారణ ముగింది. దీంతో వర్సిటీ నుంచి అధికారులు వెళ్లిపోయారు. గతంలో రిజిస్ట్రార్లుగా పని చేసిన ఆచార్య కనకయ్య, విద్యావర్ధినితోపాటు 9 మందిని అధికారులు విచారించారు. అనంతరం అక్కడినుంచి కామారెడ్డి జిల్లా బిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో తనిఖీలు చేపట్టారు. విభాగాల వారీగా తనిఖీలు చేశారు. హాస్టళ్లలోనూ విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.
అసలేం జరిగిందంటే : ఇటీవల కాలంలో ఆ యూనివర్సిటీ రిజిస్టర్ కనకయ్యను తొలగించడం.. మరో రిజిస్టర్‌ను నియమించడంతో యూనివర్సిటీలో గందర గోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. విద్యార్థులు నిరసనలు తెలిపారు. పరిపాలన భవనంలోని వీసీ ఛాంబర్‌లో బైఠాయించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రిలకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇటీవలే తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోదాలు నిర్వహించారు. మూడు కార్లలో సుమారు పది మంది అధికారులు యూనివర్సిటీకి చేరుకొని.. పరిపాలన భవనంతో పాటు అకౌంట్ సెక్షన్ కార్యాలయం, ఖజానా విభాగం, ఆర్ట్స్ కాలేజ్ భవనంలో సుమారు తొమ్మిది గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. పరిపాలన భవనంలో కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సిబ్బందిని విచారించారు.
Vigilance Investigation in TU : ఈ క్రమంలోనే పరిపాలన భవనంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో విశ్వవిద్యాలయ జీతాల చెల్లింపుపై అధికారులు వివరాలు సేకరించారు. వర్సిటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీ విషయం తెలుసుకొని వీసీ రవీందర్ గుప్తా తన పీఏతో పలు దస్త్రాలను పరిపాలన భవనం నుంచి తెప్పించుకొన్నారు. అనంతరం కారులో హైదరాబాద్ వెలుతున్న ఆయనను కామారెడ్డి జిల్లా భిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద అధికారులు అడ్డగించి.. పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీకి చెందిన పలు ఫైళ్లను తనిఖీ చేశారు.
TU Latest Updates : గతంలో జరిగిన విజిలెన్స్ సోదాలపై వర్సిటీ వీసీ ఆచార్య రవీందర్ గుప్తా స్పందించారు. తానంటే గిట్టక కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. విశ్వవిద్యాలయం స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుందని చెప్పారు. అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి తనిఖీలు చేస్తున్నారని పేర్కొన్నారు. తన వాహనాన్ని గంటకు పైగా హైవేపై ఆపి బ్యాగులో పత్రాలు తీసుకున్నారని వివరించారు. తాను హాజరుకాకున్నా పాలకమండలి చేసిన తీర్మానాల పత్రాలు, వాటిని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన పత్రాలు, ఇటీవల రిజిస్ట్రార్లుగా నియమించిన నిర్మలాదేవి, కనకయ్య ఆర్డర్ కాపీలు, మరికొన్ని పత్రాలు అందులో ఉన్నాయని రవీందర్ గుప్తా వెల్లడించారు. కానీ ఇప్పుడు టీయూలో తాజాగా మరోసారి విజిలెన్స్ విచారణ చేపట్టడం ఆసక్తికరంగా మారింది.
ఇవీ చదవండి :