sarojanamma social service in nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్‌కి చెందిన దంపతులు వెంకట్రావు, సరోజనమ్మ. వెంకట్రావునిజాం షుగర్స్‌లో ఉద్యోగిగా పనిచేయగా సరోజనమ్మ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించేవారు. ఆర్థికంగా ఏఇబ్బంది లేకున్నా సంతానం లేరనే లోటు ఉండేది. దత్తత ప్రయత్నాలు చేసినా అవేమీ సాధ్యపడలేదు. సరోజనమ్మ పాతికేళ్ల కింద రిటైర్ అయ్యారు. వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొన్నారు.
విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో భర్త మరణించారు. అంతవరకూ తోబుట్టువుల పిల్లలే తనపిల్లలు అనుకొని కాలం గడిపారు. ఆస్తిచూసి ప్రేమ చూపిస్తున్నారని తెలిసి బాధపడిన సరోజనమ్మ.. అవన్నీ చూసి విసిగిపోయింది.. ఇంటిని ఏదైనా సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకుంది. ఆ సమయంలో విశ్రాంత ఉపాధ్యాయులు పడుతున్న బాధలు ఆమెను కదిలించాయి.
విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘానికి సొంత భవనం లేదని తెలిసి తన తర్వాత ఇల్లు సంఘానికి చెందేలా ఏడాదిన్నర కింద రిజిస్ట్రేషన్ చేశారు. ఆ ఇంటి విలువ ప్రస్తుతం రెండు కోట్లు ఉంటుంది. విషయం తెలుసుకున్న బంధువులు సరోజనమ్మ ఇంటి వైపు రావడం మానేశారు.
ఓసారి దగ్గరి బంధువు చనిపోతే అంతక్రియలకు వెళ్లినప్పుడు ఇంటికి కాస్త దూరంగా శవాన్ని ఉంచారు. విషయం ఆరాతీయగా.. ఆ ఇంటి యజమాని అనుమతించలేదని తెలిసింది. ఇంకోసారి పరిచయస్థుల్లో ఒకరు చనిపోతే వారుండే ఇంటికి దూరంలో అంత్యక్రియలకు కావాల్సిన పనులు చేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఆ బాధలు తప్పట్లేదని సరోజనమ్మకు అర్ధమైంది.
ఈ రెండు ఘటనల నుంచి పరిష్కారంగా ధర్మస్థలి పుట్టిందని సరోజనమ్మ అంటారు. చనిపోయిన వారి మృత దేహాన్ని అంత్యక్రియలు జరిగే వరకు ఇక్కడ భద్రపర్చుకోవచ్చు. ఫ్రీజర్ సహా అన్ని సదుపాయాలు ఉచితంగా అందిస్తారు. ధర్మస్థల్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఇందుకోసం 2లక్షలు వెచ్చించారు. చనిపోయాక మాట అటుంచి... బతికున్న వాళ్ల ఆరోగ్యానికి భరోసా ఎవరుంటారని అనుకుంది.
అందుకే జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం ట్రస్టు సభ్యులు ప్రారంభించిన జెనరిక్ మందుల దుకాణానికి 2లక్షలు విరాళమిచ్చారు. లాభాపేక్ష లేకుండా అసలు ధరకి మందుల్ని అందివ్వడం ఆ ట్రస్టు ఉద్దేశం. రెంజల్‌లో కందకుర్తి వద్ద గోదావరి ఒడ్డున గోశాల నిర్మాణానికి సహాయం అందించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత కోసం ప్రభుత్వ గ్రంధాలయానికి పుస్తకాలను ఇచ్చారు.
ఏడాదికోసారి చింతకుంటవృద్ధాశ్రమానికి నిత్యావసరాలు, దుస్తులు అందిస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా అవయవదానంపై ప్రచారం చేస్తుంటారు. సరోజనమ్మ సేవలు ఎంతో మందిని కదిలిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.అవయవాలను దానంచేయడంతోపాటు తన మృతదేహాన్ని వైద్య విద్యార్థులు వినియోగించుకోవాలని ఆమోదపత్రం రాసిచ్చారు సరోజనమ్మ. చనిపోయిన తర్వాత ఏం తీసుకు వెళ్లలేని మనం బతికున్నప్పుడే అవసరం ఉన్న వారికి సేవ చేయడం ద్వారా చనిపోయినా బతికుండే అవకాశం ఉందని చాటుతోంది.
ఇవీ చదవండి: