నులి పురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని నిజామాబాద్ జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నేడు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈనెల 10న పంపిణీ చేసే నులి పురుగుల నివారణ మాత్రలను వివిధ వయసుల వారు సూచించిన మోతాదు మేరకు వాడాలని నారాయణరెడ్డి సూచించారు. పాఠశాల, కళాశాలల్లోని విద్యార్థులకు ముందస్తుగా అవగాహన కల్పించి మాత్రలను వేసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ఆహారం తీసుకున్న తర్వాత మాత్రలు వేసుకోవాలన్నారు. ర్యాలీలో వైద్య సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.