నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడపాకల్ ఉన్నత పాఠశాలలో 165 మంది విద్యార్థులున్నారు. వీరిలో కవులు, కథా రచయితలు ఏకంగా 70 మంది వరకు ఉన్నారు. పద్యమైనా, వచన కవితైనా, కథైనా అవలీలగా రాసేస్తారు. ఇప్పటికి వరకు ఈ పాఠశాల విద్యార్థులు మూడు శతకాలు, నాలుగు వచన కవితా సంకలనాలు, ఒక కథా సంకలనం వెలువరించారు. తెలుగు పండితుడు ప్రవీణ్ శర్మ చొరవతో విద్యార్థుల్లో సృజనాత్మకత మరింత పెరిగింది. ముందుగా పిల్లలకు చందస్సుపై అవగాహన కల్పించారు. వ్యాకరణం నేర్పించారు. మొదట్లో పద్య రచనలో యతి, గణాలు కుదరకపోవడం, సరైన వస్తువును ఎంచుకోకపోవడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రముఖ శతకాలను పిల్లలకిచ్చి చదివించారు. ఆ రచనా విధానాన్ని విశ్లేషించి చెప్పారు. పిల్లలు రాసిన పద్యాల్లో తప్పులను సరిదిద్దేవారు.
జాతీయ ఉత్తమ బాల శతకం
వారు రాసిన మొదటి శతకం చిగురుబాల. ఈ శతకాన్ని సి.నారాయణరెడ్డి ఆవిష్కరించి, సరస్వతీ మాతకు విద్యార్థులు సమర్పించిన పద్య నైవేద్యమని ప్రశంసించారు. బాలసాహితీ పోటీల్లో ఈ శతకం జాతీయ ఉత్తమ బాల శతకంగా ఎంపికైంది. చదువు ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ బుడత శతకం, ప్రకృతిని కాపాడుకోవాలని తెలిపేలా చెట్టు శతకం రాశారు. పద్యాలే కాకుండా వచనా కవితలు, కథల్లోనూ తడపాకల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. సైనికులు, దేశభక్తి, మాతృభాష ప్రాధాన్యం లాంటి ఇతివృత్తాలతో 2013లో బాల కవితా తరంగాలు అనే వచన కవితా సంకలనం తెచ్చారు. 2017లో చిగురుకొమ్మ, 2018లో 45 వచన కవితలతో నవకవనమనే సంకలనం వెలువరించారు. పాదార్చన సంకలనం, నేను కథ రాశానోచ్ అనే కథా సంకలనం వెలువరించారు.
విద్యార్థుల్లో సాహిత్యాభిలాష
ఈ ఏడాది తెలంగాణ బడి పిల్లల కథల పుస్తకంలో ఈ పాఠశాలకు చెందిన సమ్రీన్, జాహ్నవి, రఘు, అనిల్, నిఖత, మానస, వెన్నెల కథనాలు ప్రచురితమయ్యాయి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పద్య, వచన, కవితల పోటీల్లో ఈ పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రశంసలు, సత్కారాలు అందుకున్నారు. పాఠశాలలో మాతృభాషా, ఉపాధ్యాయ, బాలల దినోత్సవాలు, గురుపూజోత్సవం వంటివి ఏటా నిర్వహిస్తూ ప్రముఖ కవులు, రచయితలను పాఠశాలకు ఆహ్వానిస్తూ విద్యార్థుల్లో సాహిత్యాభిలాష పెంచుతున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు.
ఇవీ చూడండి: తెలంగాణ చిన్నమ్మ ఇకలేరు