Swinging Dhvajasthambam in Kamareddy : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే నూటొక్క లింగాలు ఉన్న గ్రామం లింగంపేట. 17వ శతాబ్దంలో లింగంపేటను మెదక్ జిల్లా పాపన్నపేట సంస్థానాధీశురాలు.. లింగమ్మదేశాయి పరిపాలించడంతో లింగన్నపేటగా పిలిచేవారు. లింగన్నపేట కాస్త కాలక్రమేణా లింగంపేటగా మారిందని స్థానికులు అంటున్నారు. లింగమ్మదేశాయి పాలనలో ఇక్కడ నగరేశ్వర ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది.
ఆ సమయంలోనే ఈ ఆలయం ఎదుట నిర్మించిన ధ్వజ స్తంభం ఆసియా ఖండంలోనే పేరుగాచింది. ఇది గాలి వీచినా, ఎవరైనా ఊపినా ఊగుతుంది. ఈ వింతను తెలుసుకోవడానికి ఆంగ్లేయుల కాలంలో ఎంతో మంది ఇంజినీర్లు పరిశోధనలు జరిపినా.. ఈ కట్టడం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించలేకపోయారు. ఈ వింత స్తంభాన్ని తిలకించేందుకు ఇతర ప్రాంతాల నుంచి పర్యటకులు వస్తుంటారు. దీన్ని చూడటానికి అప్పటి గవర్నర్ ఖట్మాండ్ బాయి దేశాయి సైతం గ్రామాన్ని సందర్శించారు.
'రాణి లింగమ్మదేశాయి పేరు మీదుగా ఈ గ్రామానికి లింగంపేట అనే పేరు వచ్చింది. పాపన్నపేట సంస్థానంలో ఈ గ్రామం ఉండేది. అదే విధంగా ఈ ఊరిలో ఎక్కడ చూసినా అనేక లింగాలు ఉండేవి. నగరేశ్వర అంటే నూటొక్క గోత్రాలు అని అర్థం. పూర్వకాలంలో ఈ గ్రామంలో నూరు గోత్రాలు ఉండేవి. ఒక గోత్రం తక్కువగా ఉండడంతో కాశీ నుంచి ఒక లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. కాకతీయుల కాలంలో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే గుడి ముందు ఉన్న ధ్వజస్తంభం కొద్ది గాలి వచ్చినా, ఎవరైనా ఊపినా ఊగుతుంది. దేశంలో ఎక్కడా ఇలాంటి నిర్మాణం లేదు. దీని పరిశీలనకు ఆంగ్లేయుల కాలంలో తవ్వి పరిశీలన చేశారు. కానీ ఎలాంటి రహస్యాన్ని ఛేదించలేదు. నగరేశ్వరుని మహిమగా గ్రామస్థులు నమ్ముతారు.'-ఆలయ పూజారి, లింగంపేట
ఈ ఊగే స్తంభం రహస్యం తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు.. కొన్నేళ్ల కింద ధ్వజస్తంభాన్ని తవ్వి అందులో ఏముందోనని పరీక్షించారు. స్ప్రింగ్‌లు, లేదా ఇతర వస్తువులు ఏమైనా ఉన్నాయా అని వెతికారు. కానీ అందులో కేవలం డంగు సున్నం తప్ప ఏమీ కనిపించలేదు. స్తంభం ఊగేందుకు కారణమైన సాంకేతిక, భౌతిక అంశాలు శాస్త్రవేత్తలకు లభించక.. ఏమీ తేల్చకుండానే తిరిగి వెళ్లిపోయారు. స్థానికులు మాత్రం నగరేశ్వర ఆలయంలోని శివుడి మహిమ వల్లే ఈ స్తంభం ఊగుతుందని భావిస్తారు. పవిత్ర మనసుతో ఎవరు ఊపినా ఊగుతుందని అంటున్నారు. అంత ఎత్తులో విశాలంగా ఉన్న ధ్వజస్తంభం ఊపితే ఊగడం వెనుకున్న కారణమేదైనా.. లింగంపేట గ్రామానికి మాత్రం ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఇవీ చదవండి: