నిజామాబాద్ జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. అకారణంగా ఎవరు బయటకు వచ్చినా వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 30 మంది కోలుకున్నట్లు శుక్రవారం సమీక్షలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 12 పాజిటివ్ కేసులు ఉండగా ఐదుగురు డిశ్చార్జ్ అయ్యారు. కామారెడ్డి జిల్లాలో గత 13 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. నిజామాబాద్ జిల్లాలో గత ఐదు రోజులుగా కొత్త కేసులు లేవు.
కంటైన్మెంట్ క్లస్టర్లలో నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ తిరగకుండా చూస్తున్నారు. నిత్యావసర సరకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు మధ్యాహ్నం ఒంటి గంట వరకే అనుమతి ఇస్తున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి రెండు రోజులకు ఒకసారి వెళ్లి ఆరోగ్య స్థితి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లాక్ డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?