నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రాజెక్టులో నీరు గరిష్ఠస్థాయి నీటిమట్టానికి (1091 అడుగులు) చేరింది. ప్రస్తుతం 16 ఆర్సీ గేట్ల ద్వారా 75 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 90.31 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో మిగులు జలాలు గోదావరిలోకి వదులుతున్నందున జిల్లాలోని తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి సూచించారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని ముందస్తుగా హెచ్చరించారు. ముంపునకు గురయ్యే గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపారు. ఆయా మండలాల రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
శ్రీరాంసాగర్ ప్రస్తుతం జలకళను సంతరించుకొంది. గోదారమ్మ నిండుగా పరవళ్లు తొక్కుతోంది. కరోనా నేపథ్యంలో ప్రాజెక్టు సందర్శనకు పర్యాటకులను అనుమతించడం లేదు. పోలీసులు అన్ని వైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి భారీ వర్షాలు... జలమయమైన లోతట్టు ప్రాంతాలు