నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కరోనా కట్టడికి పోలీసులు పడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్ కెమెరాతో నిఘా ఉందని... నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ జయపాల్ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలో మొదటి నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని ఆయన సూచించారు. బోధన్‌లోని 4 కంటైన్మెంట్ ఏరియాల్లో డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు.
వాళ్లకు హెల్మెట్, మాస్కు తప్పనిసరి...
నేటి నుంచి పట్టణంలో ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. బయటకు వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్, మాస్క్ ధరించాలని లేకుంటే వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. లాక్ డౌన్ అమలు వాటి నుంచి ఇప్పటివరకు సుమారు 1000 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని ఏసీపీ వివరించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో నివసించే వారు ఫోన్ చేస్తే నిత్యావసర సరకులను ఇంటికే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేశామన్నారు.