Bachhala Malli Review In Telugu : ఎప్పుడూ కామెడీ రోల్స్‌తో అభిమానులను ఎంటర్టైన్ చేసే టాలీవుడ్ స్టార్ హీరో అల్లరి నరేశ్ గత కొంతకాలంగా సీరియస్ రోల్స్‌తోనూ అలరిస్తున్నారు. తాజాగా 'బచ్చల మల్లి'గా ఓ రా అండ్ రస్టిక్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంతకీ ఈ ఈ మూవీ ఎలా ఉందంటే?
స్టోరీ ఏంటంటే?
బచ్చలమల్లి (అల్లరి నరేశ్) చిన్నప్పటి నుంచీ చాలా తెలివైనవాడు. తండ్రి గర్వపడేలా పదో తరగతి పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధిస్తాడు. అతడికి తండ్రి అంటే ఎంతో మమకారం. అయితే ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసుని బాగా గాయపరుస్తుంది. దీంతో ప్రపంచం అంటే ఏమిటో తెలియని వయసులోనే తన మనసుకు తగిలిన ఆ గాయం చెడు అలవాట్లు, సావాసాలకి కారణం అవుతుంది. అందుకే కాలేజీ చదువుకు కూడా స్వస్తి చెప్పి మల్లి ట్రాక్టర్ నడుపుతుంటాడు. మద్యం తాగుతూ, రోజూ ఊళ్లో ఏదో ఒక గొడవలో తలదూరుస్తూ మూర్ఖుడిలా మారతాడు. సరిగ్గా అప్పుడే తన జీవితంలోకి కావేరి (అమృత అయ్యర్) వస్తుంది. ఇక ఆమెతో ప్రేమలో పడ్డాక మల్లి తన లైఫ్‌లో తీసుకున్న నిర్ణయాలేమిటి? ఆ మూర్ఖత్వం నుంచి బయటపడ్డాడా?లేదా? అసలు తన తండ్రితో మల్లికి ఉన్న సమస్యలేమిటి? ఇంతకీ కావేరితో ప్రేమకథ సుఖాంతమైందా? లేదా అన్న విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే :
ఎటువంటి ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకునే ఓ మూర్ఖుడి కథ ఇది. చాలా మందిలో కనిపించే ఈ లక్షణం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయమే. అయితే దానికి విపరీత ధోరణి, అనూహ్య పరిణామాలు ఈ స్టోరీపై అంతగా ప్రభావం చూపించలేదు. నెగిటివ్ షేడ్స్ అలాగే రా అండ్ రస్టిక్ లుక్స్‌తో ఉన్న హీరో, అతడి చూట్టూ తిరిగే గ్రామీణ కథలు సాధారణంగా ఈ తరహాలోనే వస్తున్నాయి. డైరెక్టర్ కూడా ఆ ట్రెండ్‌ను ఓ సారి ట్రై చేయాలనుకున్నారని తెలుస్తోంది. పాత్రల్ని, కథా నేపథ్యాన్ని ఆవిష్కరించడంలో కనిపించిన నిజాయతీ, కథ చెప్పిన విధానంలో కనిపించలేదు. బచ్చలమల్లి జీవితంలో జరిగిన ఓ మూడు సంఘటనల్ని తీసుకుని ఈ స్టోరీని తెరకెక్కించామని చెప్పింది మూవీ టీమ్. ఆ సంఘటనలు సినిమాలో చాలా సాధారణంగా, చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తాయి తప్ప ప్రత్యేకతేమీ లేదు.
నిజానికి మూర్ఖత్వంతో కూడిన హీరో క్యారెక్టరైజషన్‌కి తోడు, గన్నీ సంచుల వ్యాపార నేపథ్యం, అలాగే తండ్రి నిర్లక్ష్యానికి గురైన ఓ అన్న, అవమానంతో రగిలిపోయే తమ్ముడు ఇలా మంచి కుటుంబ కథను ఈ సినిమాలో చూపించారు. అయితే ఆ అంశాలపై మేకర్స్ తగినంత కసరత్తు చేయలేదు. హీరో పాత్రపై అస్సలు జాలి కలగదు, ప్రేమ పుట్టదు, కోపం రాదు. దీంతో సినిమా అంతా చప్పగా సాగిపోతుంది. 2004తో కథని మొదలుపెట్టిన డైరెక్టర్, కథను నెమ్మదిగా 80, 90స్లోకి తీసుకెళతాడు. అయితే మూడు పార్శ్వాలుగా కథ సాగుతున్నప్పటికీ గందరగోళమేమీ ఉండదు. కానీ, ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఆత్రుతని మాత్రం ఏమాత్రం రేకెత్తించదు. ఇంటర్వెల్ సీన్స్‌లో కనిపించే ఓ కొత్త పాత్ర, దాని బ్యాక్‌డ్రాప్ మాత్రం ఓ మంచి మలుపు. ఆ పాత్ర ఎవరన్నది తేలాక మళ్లీ మామూలుగానే ఉంటుంది. ఇక పతాక సన్నివేశాలు కాస్త హృద్యంగా సాగుతూ సినిమాపై ప్రభావం చూపిస్తాయి.
ఎవరెలా చేశారంటే :
బచ్చల మల్లి పాత్రలోకి అల్లరి నరేశ్ పరకాయ ప్రవేశం చేసిన తీరు, ఆయన నటన సినిమాకి ప్రధానబలం. గాలి శీను తరహాలో గుర్తుండిపోయే పాత్రే. మూడు కోణాల్లో తెరపై కనిపిస్తూ, వైవిధ్యం ప్రదర్శించారు. డైలాగ్ డెలివరీ కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. కావేరి పాత్రలో అమృత అయ్యర్ అమాయకంగా కనిపిస్తూ, మంచి నటనని ప్రదర్శించారు. రావు రమేశ్ పాత్ర సినిమాకి కీలకం. పెళ్లి చూపుల్లో భాగంగా వచ్చే సన్నివేశాల్లో అల్లరి నరేశ్‌కీ, రావు రమేష్‌కీ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన ఆకట్టుకుంటుంది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సాధారణంగా కనిపిస్తూనే, బలంగా విలనిజం పండించారు. రోహిణి, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష బలమైన పాత్రల్లో కనిపిస్తారు.
సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన పాటల్లో మా ఊరి జాతర్లో ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. రిచర్డ్ ఎమ్.నాథన్ కెమెరా పనితనం గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపించింది. ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు కూడా మంచి పనితీరుని కనబరిచాయి. నిర్మాణం పరంగా లోటు పాట్లేమీ కనిపించవు. ఇక డైరెక్టర్ సుబ్బు కూడా కొన్ని సీన్స్‌పై, అలాగో స్టోరీ బ్యాక్‌డ్రాప్‌ను ఆవిష్కరించడంలోనూ తనదైన ముద్ర వేశారు.
బలాలు
+ అల్లరి నరేశ్ నటన
+ కథా నేపథ్యం
+ కొన్ని మలుపులు
బలహీనతలు
- రక్తి కట్టించని కథ, కథనం
- బలం లేని భావోద్వేగాలు
చివరిగా : బచ్చలమల్లి - అల్లరి నరేశ్ నటన కోసం చూడాలి.
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!