నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని చేతన్‌నగర్ దళితులకు చెందిన 30 ఏళ్ల నుంచి వివాదాస్పదంగా ఉన్న భూములకు సమస్యను రెవెన్యూ సిబ్బంది పరిష్కరించారు. బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేతులమీదుగా 70 మందికి పట్టా సర్టిఫికెట్లను అందజేశారు.
అలాగే కోటగిరి మండలంలోని పేద బడుగు బలహీన వర్గాల కోసం మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన రూ. 80 వేల చొప్పున 34 మందికి చెక్‌లను పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి కోసం రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా 10 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇచ్చారు.
అలాగే జల్పల్లి ఫారం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తగాదాలోని భూమి సమస్యను పరిష్కరించి వారి కబ్జాలో ఉన్న రైతులకు పట్టా పాసు బుక్కులు పంపిణీ చేశారు. ఈ రోజు ఇలాంటి పథకాలు పేదలకు అందుతున్నవంటే అది కేవలం సీఎం కేసీఆర్ కృషి వల్లే అని స్పీకర్ అన్నాకు. రైతుల సమస్యలను పరిష్కరించి పట్టాలు జారీచేసిన తహసీల్దార్ విఠల్‌ను స్పీకర్ పోచారం అభినందించారు.