నిజామాబాద్ జిల్లా బోధన్ నడిబొడ్డున ఉన్న నిజాం చక్కెర పరిశ్రమ భూములు అక్రమార్కులకు అడ్డాగా మారాయి. సౌత్ పూల్‌ను ఆనుకుని ఉన్న 3.05 ఎకరాలు భూమిని కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా కాజేయాలని చూస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. భూముల ధర పెరగడం వల్ల ఎలాగైనా సొంతం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు.
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో...
నిజాం చక్కెర పరిశ్రమకు చెరకు తరలించే ఎడ్లబండ్లు, లారీలు, ట్రాక్టర్లు నిలిపేందుకు పార్కింగ్ కోసం సర్వే నంబర్ 178లో అప్పటి యాజమాన్యం భూమిని ఉపయోగించింది. దీనిని 1953లో గులాం అహ్మద్ అనే వ్యక్తి నుంచి నిజాం షుగర్స్ కొనుగోలు చేసింది. 1955 ఖాస్రా పహాణీలో ఈ విషయం స్పష్టంగా ఉంది. 2004లో నిజాం షుగర్స్ యాజమాన్యం దక్కన్ షుగర్స్‌కు విక్రయించిన భూముల్లో ఈ సర్వే నంబర్ కూడా ఉంది. సదరు భూమిని దక్కన్ షుగర్స్ అధికారులు 2013లో హైదరాబాద్‌లోని ఒక జాతీయ బ్యాంకులో తమ ఆర్థిక అవసరాల కోసం డిపాజిట్‌గా పెట్టారు. అయితే సర్వే నంబర్ 178లోని భూమిలో 2.30 ఎకరాలను కొనుగోలు చేశానంటూ ఓ వ్యక్తి ధ్రువపత్రాలతో రావడం అనుమానం కలిగిస్తోంది. అలాగే ఇందులోని 1.38 ఎకరాలకు 2006లో రిజిష్ట్రేషన్ చేయించుకుని మండలంలోని ఒక సహకార బ్యాంకులో తనఖా పెట్టి ఓ మహిళ 2010లో రుణం తీసుకుంది. ఇలా నిజాం చక్కెర పరిశ్రమ భూములపై ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూమిని ఆక్రమించే ప్రయత్నం చేయడం వివాదాస్పదంగా మారుతోంది.
లింక్ డాక్యుమెంట్ల జాడేది...?
సాధారణంగా ఏ భూమిని రిజిష్ట్రేషన్ చేసినా లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉంటాయి. సంబంధిత భూ క్రయవిక్రయాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో క్షుణ్ణంగా తెలిసిపోతాయి. కానీ నిజాం చక్కెర పరిశ్రమకు చెందిన భూములు తమవేనంటూ ప్రైవేటు వ్యక్తులు చూపిస్తున్న ధ్రువపత్రాలకు అసలు లింక్ డాక్యుమెంట్లు లేవు. అయితే నిజాం పరిశ్రమకు చెందిన భూములకు సంబంధించి 178 సర్వే నంబర్‌కు బదులుగా 178/1 అని వేసి తమకు వారసత్వంగా వచ్చిందని చూపిస్తూ 2.30 ఎకరాలు అక్రమంగా రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమార్కులదే రాజ్యం
ప్రైవేటు సంస్థ ఆధీనంలో ఉన్న చక్కెర పరిశ్రమ యాజమాన్యం 2014లో పరిశ్రమ అవసరాల కోసం 170 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. 2014లో రిజిష్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే రిజిష్ట్రేషన్ తర్వాత భూమిని మ్యుటేషన్ చెయ్యకపోవడం వల్ల భూముల రిజిష్ట్రేషన్లు రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కలేదు. అలాగే పట్టాదారు పాసుపుస్తకాలు కానీ, రెవెన్యూ పహాణీలు కానీ తీసుకోలేదు. ఈ విషయాన్ని కొందరు అధికారుల ద్వారా తెలుసుకున్న అక్రమార్కులు భూములపై కన్నేసి అక్రమంగా రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే వీటిని నివారించేందుకు యాజమాన్యం ప్రైవేటు సెక్యూరిటీని స్థలం వద్ద కాపలాగా ఉంచింది. వారంరోజుల కింద భూమి చదును చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ప్రధాన రహదారికి కూతవేటు దూరంలో ఉన్న భూముల ధరలకు రెక్కలు రావడం వల్ల అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. స్థల వివాదాలు రేపి... వాటిని సొంతం చేసుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి చక్కెర పరిశ్రమ భూములు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే విలువైన భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : కొబ్బరిచెట్టు సీమంతం చూతము రారండి!