Sriramsagar project history : ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. 1963 జులై 26న ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. 2023 జులై 26 నాటికి ఎస్సారెస్పీ 60 ఏళ్లు పూర్తిచేసుకుంది. దీనికి నాటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ.. మెండోరా మండలం పోచంపాడ్ వద్ద శంకుస్థాపన చేసి పునాది వేశారు. మహరాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద జన్మించిన గోదావరి నది.. బాసర సమీపంలో తెలంగాణలో కలుస్తుంది.
తొలి సాగునీటి ప్రాజెక్టు.. రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన తొలి సాగునీటి ప్రాజెక్టు ఇదే. ప్రస్తుతం ఎస్సారెస్పీ ద్వారా.. ఎగువ మానేరు కింద నిజామాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్.. దిగువ మానేరు కింద కరీంనగర్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతోంది.
1969లో శ్రీరాంసాగర్ జలాశయం పనులు ఊపందుకున్నాయి. 1978లో పనులు పూర్తయ్యాయి. 1093 అడుగులతో 112 టీఎంసీల సామర్థ్యంతో వరద ప్రవాహాన్ని తట్టుకునేలా సువిశాలమైన బండరాయిని ఎంచుకుని ప్రాజెక్ట్‌ని 140 చదరపు అడుగుల ఎత్తుతో.. 3,143 అడుగుల పొడువుతో రాతికట్టడం, 125 అడుగుల ఎత్తుతో 475 అడుగుల పొడవు మట్టికట్టడంతో మొత్తం 47,893 అడుగుల ఆనకట్ట నిర్మించారు.
అలాగే 2,510 అడుగుల జలధారితో.. 95,425 చదరపు మైళ్ళ క్యాచ్మెంట్ ఏరియాతో 16 లక్షల క్యూసెక్కుల భారీ వరదను తట్టుకునేలా నిర్మించారు. వరదనీటిని దిగువ గోదావరిలోకి విడుదలకు 42 వరద గేట్లు, 6 రివర్స్ స్లూయిస్ గేట్లు నిర్మించారు. గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వే చేసిన అధికారులు ఉమ్మడి బాల్కొండ మండలంలోని పోచంపాడ్ అనువైందని భావించారు.
"1983లో మొదటిసారి ఎగువ నుంచి భారీ వరదలు రాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా.. 42గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దిగువన ఉన్న గ్రామాలు, పంటపొలాలు, పశువులు, ఇళ్లు కొట్టుకుపోయాయి. నాటి ఘటనతో అప్రమత్తమైన అధికారులు వరదను అంచనా వేస్తూ దిగువకు నీటిని వదులుతున్నారు." - శ్రీధర్‌రావు దేశ్‌పాండే, సీఎం ఓఎస్డీ, నీటి పారుదలశాఖ
40.10 కోట్ల అంచనాలతో నిధులు మంజూరు చేశారు. 1963లో శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. 1970 వరకు ఇప్పటి కాకతీయకాలువకు 30 కిలోమీటర్ల మేర పనులు పూర్తవ్వగా తొలిసారి అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి.. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోని 25 వేల ఎకరాలకు సాగు నీటిని అందించారు.
పూడికతో తగ్గిపోయిన నిల్వ సామర్థ్యం.. 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 112 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. పూడిక కారణంగా ఇది 90.313 టీఎంసీల నీటి నిల్వకు పడిపోయింది. ఆయకట్టుకు నీరందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మి పేర్లతో 3 కాల్వలు నిర్మించారు. పోచంపాడ్ గ్రామం వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టును ప్రారంభంలో పోచంపాడ్ ప్రాజెక్టుగా పిలిచేవారు.
1978లో పూర్తవ్వగా పోచంపాడ్లో ప్రసిద్ధిగాంచిన శ్రీకోదండరామస్వామి పేరు మీదుగా శ్రీరాంసాగర్ పేరు మార్చారు. కాకతీయ కాల్వతో 9.22లక్షలకు, సరస్వతి కాలువ కింద 35 వేల ఆయకట్టుకు.. లక్ష్మి కాలువ కింద 22వేల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయి. కాకతీయ కాల్వ 284 కి.మీ.లు, లక్ష్మి కాలువ 3.5 కి.మీ.లు, సరస్వతి కాలువ 47 కి.మీ.ల వరకు నీటిని అందిస్తున్నాయి
విద్యుదుత్పత్తి ప్రాజెక్టు.. 1983లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో విద్యుత్తు ఉత్పాదన కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 36 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం చేపట్టగా.. మొదట పూర్తైన 3 టర్బైన్లను 1988లో ప్రారంభించారు. అలా ప్రస్తుతం 4 టర్బైన్లతో 36 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.
ఎగువన మహారాష్ట్రలో గోదావరిపై అక్కడి ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించింది. ప్రధానంగా నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చుక్క నీరు రాని పరిస్థితి తలెత్తింది. దీనికి నిరసనగా 2005లో టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యేలు మహారాష్ట్ర సరిహద్దులో బాబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు.
శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం.. ఒకవేళ వర్షాలు రాక ప్రవాహం తగ్గితే పరిస్థితి ఏంటన్న అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2017లో పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించింది. దీనిద్వారా ఎగువ నుంచి ప్రవాహం రాకపోతే దిగువన ఉన్న గోదావరి నీళ్లను ఎగువకు శ్రీరాంసాగర్లోకి తరలించాలన్నది ప్రభుత్వ యోచన. ఇందుకోసం మిగులు జలాల్ని తరలించేందుకు తవ్విన వరద కాలువను వినియోగించుకుని.. రివర్స్ పంపింగ్ చేసేందుకు మూడు చోట్ల పంప్‌హౌస్‌లు నిర్మించారు.
"ఈ ప్రాజెక్టు మాకు జీవనాధారం. సాగుకు ఎటువంటి నీటిఎద్దడి లేకుండా.. పంటలు పండిస్తున్నాము. ప్రభుత్వం వర్షాలు లేని సమయంలో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టులో పూడిక తీసి నీటి సామర్ధ్యం పెంచాలి". - రాజన్న, రైతు ముప్కాల్
90టీఎంసీల సామర్థ్యమని అధికారులు చెబుతున్నా నిపుణులు, రైతుల ప్రకారం ప్రస్తుతం అది 70 నుంచి 80TMCల మధ్యే ఉంది. పర్యాటకంగానూ ప్రాజెక్టు వెనుకంజలో ఉంది. దీంతోపాటు ప్రాజెక్టు మధ్యలో ఉన్న గడ్డను ద్వీపకల్పంలా మారుస్తామని గతంలో అన్నారు. ప్రాజెక్టు నుంచి బాసర వరకు జలరవాణా ఏర్పాటు చేస్తామని అన్నారు. అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి :