కరోనా తర్వాత ప్రజల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ప్రజా రవాణా అందుబాటులోకి వచ్చినా.. ప్రయాణికులు ఆసక్తి కనబరచడం లేదు. కొవిడ్ వ్యాప్తి భయంతో సొంత వాహనాలకే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. వాహనాల ధరలు భారీగా పెరగడం వల్ల దిగువ, మధ్య తరగతి ప్రజలు... పాత వాహనాలు కొనుక్కునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వాహనాల కొనుగోళ్లు పెరగడం వల్ల వీటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.
ఛార్జీల బాదుడుతో...
ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చిన ఆక్సుపెన్సీ 60 నుంచి 70 శాతం దాటడం లేదు. వాటితో పాటు ఆటోలు, క్యాబ్‌లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఓ వైపు పెట్రోలు ధరలు పెరుగుతున్నా.. ప్రైవేటు వాహనాల్లో అధిక ఛార్జీలు వసూలు చేయడం వల్ల సొంత వాహనాలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పలు కొత్త వాహనాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు.
అమ్మకాలు పెరిగాయి
కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పాత వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది. లాక్డౌన్లో తలెత్తిన ఇబ్బందులు, సొంత వాహనం లేకపోవడం వల్ల ఎదురైన సమస్యలు వెరసి ప్రజలు సొంత వాహనాలు సమకూర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.
-మహ్మద్ అజాద్, సన్‌సైన్ డీలర్
కొత్త వాహనాల ధరలు పెరగడం వల్ల ఎక్కువ మంది పాత వాహనాలు కొనేందుకు వస్తున్నారు. రోజుకు ఐదు నుంచి ఆరు వాహనాలు అమ్ముడవుతున్నారు. మంచి వాహనం వస్తే వెంటనే అమ్ముడయిపోతోంది. -రాయల్ మోటార్స్ యజమాని
ధరలు పెరుగుదల..
కొత్త వాహనాల ధరలు పెరగడం కూడా పాత వాహనాలకు డిమాండ్ పెరిగింది. జనవరి నుంచి ధరల్లో పెరుగుదలతో పాత వాహనాలకు డిమాండ్ పెరిగింది. దిగువ, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు ఉండడం వల్ల పాత వాహనాలు కొనేందుకు ఎక్కువమంది వస్తున్నారు.
పాతదే నయం
పాత వాహనం కొనడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. సగం ధరల్లోనే కొనుక్కోవచ్చు. వీటి వల్ల వాహనాలపై అవగాహన కూడా వస్తోంది. కరోనా వల్ల సొంత వాహనం కొనుక్కోవడమే మేలనిపిస్తోంది. -కొనుగోలుదారు
ఏది ఏమైనా కరోనా, నూతన వాహన ధరల పెరుగుదల వెరసి సెకండ్ హ్యాండ్ మార్కెట్‌కు కలిసొచ్చింది. మంచి వాహనం మార్కెట్లోకి వస్తే క్షణాల్లో అమ్ముడైపోతోంది.
ఇదీ చూడండి: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోంది : కేటీఆర్