రోడ్డుపై ఇరువైపులా వరి ధాన్యం అరబెట్టడం వల్ల ఓ పసి బాబు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని భూమన్న అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విగ్నేష్ ఇంటి నుంచి ఉదయం పేస్టు కోసం రోడ్డు అవతల ఉన్న కిరాణా దుకాణానికని వెళ్లాడు. తిరిగి రోడ్డు దాటుతుండగా.. నందిపేట్ నుంచి నవీపేట్ వైపు లోడ్‌తో వెళ్తున్న వడ్ల లారీ అతివేగంతో వచ్చి బాలుడి వైపు దూసుకెళ్లింది. రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు ఉన్నా డ్రైవర్ అతివేగంతో లారీ నడిపినందునే ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడని స్థానికులు చెప్తున్నారు.
మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. భయంతో లారీ డ్రైవర్ పారిపోయాడు. పది కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ వద్ద గ్రామస్థులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య