కరోనా చైనా సరిహద్దులు దాటగానే ప్రపంచం ఉలిక్కిపడింది. కేసులు, మరణాలు పెరగ్గానే అన్ని దేశాలూ అప్రమత్తమయ్యాయి. కొవిడ్-19 వైరస్ బారిన పడ్డామా? లేదా? తేలాలంటే పరీక్ష ఒక్కటే మార్గం. మిగతా పరీక్షల మాదిరిగా ఇదంత సులువు కాదు. వ్యక్తులు నేరుగా వెళ్లి చేయించుకోలేరు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి, ప్రభుత్వం అనుమతించిన ప్రయోగశాలల్లోనే పరీక్షించాలి. ఫలితాలు రావాలంటే మొదట్లో రెండు రోజుల సమయం పట్టేది. ఇప్పుడైతే కనీసం నాలుగైదు గంటలు. ఈ మహమ్మారి తీవ్రత ముందే గమనించారు హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ హ్యువెల్ లైఫ్ సైన్సెస్ సీఈవో డాక్టర్ రచనా త్రిపాఠి. కరోనా కిట్ల ఆవశ్యకతను గుర్తించి వీరి బృందం జనవరి ఆరంభంలో పరిశోధన మొదలుపెట్టి, 25 రోజుల్లోనే కొత్తరకం కిట్ అభివృద్ధి చేసింది.
డిజైన్‌లో మార్పు..
కేరళలో తొలి పాజిటివ్ కేసు నమోదు కాకముందే కిట్ తయారైంది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆమోదం లభిస్తే ఉత్పత్తి ప్రారంభించడమే తరువాయి. ఇంతలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. కిట్‌లో ఉపయోగించే కొన్ని పరికరాలు విదేశాల నుంచి రావాలి. దిగుమతులు ఆగిపోయాయి. ఇదీ ఒకందుకు మేలే చేసిందంటారామె. ఈ పరిస్థితిలో దేశీయంగా లభించే పరికరాలతోనే కిట్ తయారీ ప్రారంభించారు. అప్పటికప్పుడే డిజైన్ మార్చేశారు. లాక్‌డౌన్‌లో ఇతర మహిళలంతా ఇంట్లోనే ఉండి పిల్లలు, కుటుంబసభ్యులతో గడిపితే రచన బృందం పూర్తిగా కార్యాలయానికే అంకితమైపోయింది. రాత్రింబవళ్లూ పరిశోధనలోనే మునిగిపోయింది. కష్టం అనిపించినా దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య తీర్చడంలో తామూ భాగం అవుతున్నాం అని సర్దిచెప్పుకొని పనిలో నిమగ్నమయ్యేవాళ్లు. మొత్తానికి వారి శ్రమ ఫలించింది. పూర్తిస్థాయిలో దేశీయ కరోనా నిర్ధారణ కిట్ తయారైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కిట్లలో పరీక్షలకు ఉపయోగించే వాటిని వేర్వేరు సంస్థలు సరఫరా చేస్తున్నాయి. హ్యువెల్ లైఫ్ సైన్సెస్ కిట్‌తోపాటూ అవసరమైన ఎంజైమ్‌లు, ప్రైమర్, బఫర్లూ ఉత్పత్తి చేసి ఇస్తున్నారు. ఫలితంగా ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకయ్యే వ్యయం రూ.1,100లకు తగ్గింది.
తెలుగింటి కోడలు
రచన స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్. ఎంఎస్సీ తర్వాత బెంగళూరులోని ఐఐఎస్‌సీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీజీ సహాధ్యాయి నిజామాబాద్‌కు చెందిన శిశిర్ పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. తర్వాత ఆమె హైదరాబాద్ వచ్చి సీసీఎంబీలో ఉద్యోగంలో చేరారు. అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో క్యాన్సర్ బయాలజిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు. తర్వాత శిశిర్‌తో కలిసి అలహాబాద్‌కి వెళ్లారు. అక్కడే సోదరుడి పాథాలజీ ల్యాబ్‌లో కొత్తగా మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ విభాగం ప్రారంభించారు.
మూడేళ్లలో పదకొండు జబ్బులకు కిట్లు
మూడేళ్లలో పదకొండు వేర్వేరు జబ్బులకు సంబంధించిన నిర్ధారణ పరీక్షల కిట్లు తయారు చేశారు. హెచ్‌ఐవీ, గన్యా మొదలు అన్నిరకాల రోగాల కిట్ల రూప కల్పన, ఉత్పత్తి చేస్తున్నారు. ఇతర పరీక్షల కోసం ముందే సిద్ధం చేసిన ఎంజైమ్‌లు, బఫర్స్ వంటివి తయారు చేయడం, ఉత్పత్తి మొదటి నుంచి ఉండటంతో కరోనా నిర్ధారణ కిట్‌ను తక్కువ సమయంలో అభివృద్ధి చేయగలిగామంటారు రచన.