Nizamabad Colony Problems: ధ్వంసమైన రహదారులు, రోడ్ల పై పారే మురుగు నీరు, దుర్గంధం వెదజల్లే పరిసరాలు. కనీస సౌకర్యాలకూ నోచుకోని ప్రజలు. ఇదీ నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని విలీన గ్రామాల పరిస్థితి. శరవేగంగా విస్తరిస్తున్న గంగాస్థాన్ కాలనీ మున్సిపల్ కార్పొరేషన్‌లో కలిసినా, కనీస వసతుల కల్పన చేపట్టలేదు. కాలనీ విస్తరిస్తున్నా సౌకర్యాలు మాత్రం చేకూరడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేని తనంతో కాలనీ వాసుల కష్టాలకు కారణంగా మారుతోంది.
నగరం విస్తరిస్తున్నా సమస్యలు అలాగే: నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. శివారు గ్రామాలన్నీ నగర పాలక సంస్థలో విలీనమయ్యాయి. కార్పొరేషన్ లో కలిస్తే మరిన్ని సౌకర్యాలు సమకూరుతాయని ప్రజలు ఆశించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా. వసతుల కల్పనకు మాత్రం నోచుకోవడం లేదు. ఇందుకు గంగాస్థాన్ ఫేజ్- 2 కాలనీ ఉదాహరణగా నిలుస్తోంది. కాలనీ ఏర్పాటై దశాబ్ధం కాలం పూర్తవుతున్నా.కనీస సౌకర్యాల కోసం ప్రజలు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది
ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు : గంగాస్థాన్ ఫేజ్ 2 కాలనీ 2001 లో ఏర్పాటైంది. దీనికి అనుబంధంగా 2006లో ఫేజ్ 3 కూడా విస్తరించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో దాదాపు ఆరు వేల కుటుంబాలు ఏర్పాటయ్యాయి. అప్పుడు నిర్మించిన రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ తర్వాత మళ్లీ ఏనాడూ వాటి వైపు కార్పొరేషన్ అధికారులు దృష్టి పెట్టలేదు. దీంతో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
దుమ్ము వల్ల రోగాలు: గంగాస్థాన్ ఫేజ్ 2 కాలనీ పరిధిలోని రోడ్ నంబర్ 1 నుంచి 3వరకు భూగర్భ మురుగు నీటి వ్యవస్థ నుంచి మురుగు బయటకు వస్తోంది. రోడ్ 4, 5లో రోడ్డంతా కంకర తేలి.. ఒక వాహనం వెళ్తుంటే దాని వెనక వెళ్లే వాహనదారులు దుమ్ముతో కూరుకుపోతున్నారు. కాలనీ అంతర్గత దారులలో వీధి లైట్లు కొరవడ్డాయి. కాలనీ వేగంగా విస్తరిస్తోందని.. అందుకు అనుగుణంగా వసతులు కల్పించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోందని, జనభా పెరికిపోయిందని, కాలనీల్లో అంతర్గత సమస్యలు పరిష్కరించి కనీస సౌకర్యాలు కల్పించాలని నగర వాసులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: