Privileges Committee : నిజామాబాద్ ఎంపీ అర్వింద్ దాడి ఘటనపై విచారణ జరపాలన్న ప్రివిలేజ్ కమిటీ.. 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. అర్వింద్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నిజామాబాద్ కలెక్టర్, సీపీ, ఆర్మూర్ పోలీసులకు కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ఇదీ జరిగింది..
TRS attack on MP Arvind : గతనెల 25న నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ అర్వింద్ పాల్గొనేందుకు వెళ్లారు. నందిపేట మండలం చిన్నయానాంలో ఎంపీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహారీ, అన్నారంలో బస్ షెల్టర్‌ను ఎంపీ అర్వింద్ ప్రారంభించాల్సి ఉంది. ఎంపీ రానున్నారన్న సమాచారంతో తెరాస తెరాస శ్రేణులు అడ్డుకునేందుకు సిద్ధమవగా.. అర్వింద్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ అర్వింద్ తన శ్రేణులతో కలిసి ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో చేశారు. ఏదైనా ఆందోళన చేస్తామంటే భాజపా నేతలను హౌస్ అరెస్టే చేస్తారని.. తెరాసకు అది వర్తించదా అని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు.
పోలీసులు తెరాసకు సహకరించారు
అనంతరం నందిపేట్ మండలంలో కార్యక్రమాలకు వెళ్లేందుకు బయల్దేరగా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి వద్ద దాడి జరిగింది. అధిక సంఖ్యలో ఎంపీ అర్వింద్ వాహనంతోపాటు ఇతర వాహనాలపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘటన అనంతరం నేరుగా ఎంపీ అర్వింద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. దాడి విషయంపై అదనపు డీసీపీ వినీత్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తెరాస నేతలే తమ కార్యకర్తలతో దాడి చేయించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు తెరాసకు సహకరించారన్నారు. దాడి విషయంపై ముందే పోలీస్ కమిషనర్‌కు తాను సమాచారం ఇచ్చానని.. వందల మంది గుడిగూడి కత్తులు, రాళ్లు, రాడ్లతో దాడి చేస్తారని తెలిసిందని చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ దాడి చేయించారని ఆరోపించారు. జీవన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో 50వేల మెజార్టీతో ఓడించి గుణపాఠం చెప్తానన్నారు. ఆ దాడి ఘటనపై ప్రివిలేజ్ కమిటీ ఎంపీ అర్వింద్ ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: TRS attack on MP Arvind : ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్లతో దాడి చేసిన తెరాస శ్రేణులు