నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపుతోపాటు ఇతర పంటల విక్రయాలు జరుగుతుంటాయి. ఏడాది పొడవునా ఇక్కడ పనులు ఉంటాయి. దీంతో 40ఏళ్లక్రితం జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర నుంచి అనేక కుటుంబాలు నిజామాబాద్‌కు వలస వచ్చాయి. నాందేడ్ జిల్లా నుంచి నిజామాబాద్‌కు 1960 ప్రాంతం నుంచి వర్షాభావ పరిస్థితులతో చేసేందుకు పనులు లేక పొట్ట నింపుకునేందుకు వచ్చేశారు. మార్కెట్ యార్డులో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిత్యం ఏదో ఒక పని లభించడం వల్ల తిరిగి సొంత గ్రామాలకు వెళ్లలేదు. ఇక్కడ స్థిరంగా ఉంటూ కూలీ చేయగా వచ్చే పనులతోనే బతుకు వెళ్లదీస్తున్నారు.
ఇక్కడే స్థిరపడిన కూలీలు
మహారాష్ట్ర నుంచి వచ్చిన దాదాపు 100 కుటుంబాలు ఇక్కడే స్థిరపడిపోయాయి. పసుపు సీజన్‌లో మరో 200 కుటుంబాలు ఏటా నిజామాబాద్‌కు ఉపాధి కోసం వస్తుంటాయి. సీజన్ పూర్తయిన తర్వాత వీరంతా తిరిగి వెళ్లిపోతారు. పురుషులు హమాలీ పనులు చేస్తుంటారు. మార్కెట్లో బీట్ పూర్తయిన తర్వాత బస్తాలను లోడింగ్ చేస్తారు. మహిళలు సైతం చినిగిపోయిన సంచులను కుడుతూ, చాట పని చేస్తూ జీవిస్తున్నారు.
ఖర్చులకే సరిపోతున్నాయి..
మార్కెట్‌లో కూలీ పనులు చేస్తూ ప్రతి నెలా ఒక్కొక్కరు 8వేల నుంచి 10వేల వరకు సంపాదిస్తున్నారు. అద్దె, నిత్యావసరాలు, పిల్లల చదువులు, ఆసుపత్రి ఖర్చులు.. ఇలా వచ్చిన డబ్బులు వీటికే సరిపోతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే స్థిరపడటంతో తిరిగి వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు.
ఆదుకోండి సారూ..
దశాబ్దాల కింద అక్కడ పని లేక ఇక్కడికొచ్చి ఉపాధి పొందిన కూలీలకు.. ఇప్పుడు ఇక్కడ మార్కెట్లోనూ సరిపడా పనిలేని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కూలీలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: బాలికల భవితకు భరోసా కల్పించిన ఉన్నతాధికారి