నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ పోలింగ్ నిర్వహిస్తారు. కరోనా వచ్చిన ప్రజాప్రతినిధులకు ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించామని కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు. పోలింగ్ రోజు చివరి గంటలో పీపీఈ కిట్‌తో నేరుగా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. పీపీఈ కిట్టుతో పాటు అంబులెన్సును సమకూర్చుతామని కలెక్టర్ తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు గురువారం ఉదయం 10 గంటల వరకు గడువు ఉండగా ఒక్క విన్నపం మాత్రమే వచ్చిందన్నారు. 824 మంది ఓటర్లకు 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 399 మంది ఉద్యోగులు పోలింగ్ విధుల్లో ఉంటారు. 14 సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 12న నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్లు లెక్కిస్తారు.
ఇదీ చదవండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్‌కు సర్వం సిద్ధం