రాష్ట్రంలోని ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయారని... ఏం చేయాలో తెలియక గవర్నర్‌ను సంప్రదిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సైతం అసంతృప్తిగా ఉన్నారన్నారు. కరోనా కట్టడిపై ప్రభుత్వ అధికారులతో గవర్నర్ మాట్లాడటానికి ప్రయత్నిస్తే అధికారులు భయపడుతున్నారని తెలిపారు.
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమీ చేయలేదని... ఇంటర్ విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించలేదని మండిపడ్డారు. కొండగట్టు దుర్ఘటన జరిగిన సమయంలో ముఖ్యమంత్రి కనీసం అక్కడ పర్యటించలేదని... వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల మరణాలపై ప్రభుత్వం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించిందని ఆరోపించారు. నిజామాబాద్‌ను తెరాస, ఎంఐఎంలకు అడ్డాగా భావించారని... కానీ అది గతమని... ఇందూరు ఇప్పుడు కాషాయ జెండాకు నిర్వచనమని బండి సంజయ్ తెలిపారు. నిజామాబాద్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి : 'కరోనా కట్టడికి దిక్కులేదు కానీ... కొత్త సచివాలయమా?'