గతేడాది వేలాది మంది కరోనా బాధితులకు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, హౌస్ సర్జన్లు చివరకు పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి కష్టపడ్డారు. వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గడంతో కొవిడ్ బాధితుల సంఖ్య తగ్గింది. అన్ని విభాగాల్లో ఓపీ, ఐపీ సేవలు ప్రారంభించారు. మహారాష్ట్ర ప్రభావంతో నెల రోజులుగా నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అప్రమత్తమైన అధికారులు కరోనాను కట్టడి చేసేందుకు బాధితులకు చికిత్స అందించేందుకు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు.
భారీగా పెరుగుతున్న కేసులు
ఇప్పటికే కొవిడ్ విభాగాలకు అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని ఎంపిక చేశారు. వార్డులను శుభ్రం చేస్తున్నారు. 250 పడకలకు ఆక్సిజన్ అమర్చారు. జిల్లా పాలనాధికారి మరో 100 పడకలు మంజూరు చేశారు. ఐసీయూలో మరో 30 పడకలున్నాయి. ప్రభుత్వాసుపత్రి కరోనా వార్డులో 75 వెంటిలేటర్లు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఐసీయూలో 12, ఐసోలేషన్లో 15 మంది చికిత్స పొందుతున్నారు. సాధారణ ఓపీ నిత్యం 900 ఉండగా.. గత పది రోజుల్లో కరోనా ఓపీ 1,530గా ఉంది. పరీక్షల సంఖ్యను పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్ తెలిపారు.
గర్భిణీల కోసం
కొవిడ్ బాధిత మహిళల ప్రసవాలకు గతంలో తాత్కాలిక ఆపరేషన్ థియేటర్ ఉపయోగించారు. ప్రస్తుతం కరోనా విభాగంలోని మొదటి అంతస్తులో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు. గత పదిహేను రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో అధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ముంచుకొస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధమవుతున్నారు అధికారులు.
ఇదీ చూడండి: 'పక్కా సమాచారం ఇస్తే... మౌలిక వసతులు సమకూరుతాయ్'