నిజామాబాద్ నగరంలో వినాయక్‌నగర్, అర్సపల్లిలోని అర్బన్ ప్రాథమిక హెల్త్ సెంటర్లోని కరోనా టెస్టింగ్ సెంటర్లను కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించారు. ఆగస్టు 21 నుంచి జిల్లాలో 127 సెంటర్లలో ప్రతిరోజు 2500 పై చిలుకు కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కరోనా సోకిన వారెవరూ భయపడవద్దని, సరైన జాగ్రత్తలతో వైరస్ బారి నుంచి బయటపడవచ్చన్నారు.
జిల్లాలో లక్షణాలున్న ప్రతి ఒక్కరికి నిర్ధరణ పరీక్ష చేస్తామని, ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారికి, గర్భిణీలు, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు తప్పనిసరిగా పరీక్షలు చేస్తున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి అక్కడే కౌన్సెలింగ్ నిర్వహించి ఐసోలేషన్ కిట్ ఇచ్చి హోం ఐసోలేషన్‌కు పంపిస్తున్నామని వెల్లడించారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్‌లలో మూడు ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లు ఉన్నాయని, వీటితో పాటు 7 ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతిచ్చామని కలెక్టర్ తెలిపారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారికి మెడికల్ ఆఫీసర్లు సలహాలు ఇవ్వాలని, కొవిడ్ లక్షణాలు లేని వారు భయపడాల్సిన అవసరం లేదని, కొన్ని లక్షణాలు కనిపించిన వారు కూడా మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పారు.
జిల్లా ఆసుపత్రిలో 272 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశామని, ఐసీయూలో 60 బెడ్స్ ఉన్నాయని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వాడే ఔషధాలు, పరికరాలు ఉన్నాయని నారాయణరెడ్డి వెల్లడించారు. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి యోగా, వ్యాయామం చేస్తూ సీ, డీ విటమిన్లు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. సిటీ స్కాన్ ద్వారా కరోనా నిర్ధరణ చేయలేమని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిటీ స్కాన్‌తో సామాన్యుల నుంచి డబ్బు గుంజే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలెవరూ ఇలాంటి మోసాలకు గురికావద్దని కోరారు.
- ఇదీ చూడండి : 'నిజమైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను ఇస్తున్నాం'