నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని 'నిజాం షుగర్ ఫ్యాక్టరీ' ఆసియాలోనే అతి పెద్దది. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మనుగడ కోల్పోయింది. అందులో పని చేసిన కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. 2015లో కర్మాగారానికి ప్రభుత్వం లే ఆఫ్ విధించింది. అప్పట్నుంచి ఇప్పటివరకు జీతాలు లేకపోవడంతో ఎంతో మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సోమవారం.. బోధన్ నుంచి హైదరాబాద్ వరకు కార్మికులు సుమారు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మికులు కోరారు. ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆకలి చావులను నివారించాలని.. మిగతా కార్మికులు చనిపోక ముందే సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వారి పాదయాత్రకు భాజపా, శివ సేన, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సంఘీభావం తెలిపాయి.
ఇదీ చదవండి: నిరుపేదల ఆకలి తీర్చేందుకు 'రాజ్‌భవన్ అన్నం': గవర్నర్