తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి రూ.10కోట్లు వెచ్చించారు. ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోనే అన్ని విభాగాలతో పాటే మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఉంది. అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో నిజామాబాద్‌కు కూడా నిధులు మంజూరు చేశారు. మొదట ఐదు అంతస్తులు నిర్మించాలనే ప్రణాళికతో భవనాన్ని ప్రారంభించారు. నిధులు సరిపడా లేకపోవడం, మొదట చూపించిన స్థలం కంటే ఎక్కువ స్థలంలో నిర్మించాల్సి రావడం వల్ల ఒక్క అంతస్తుకే నిధులు అయిపోయాయి. ప్రస్తుతం ఈ భవనంపై మరో నాలుగు అంతస్తులు నిర్మించేందుకు అవకాశం ఉంది. అయితే మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఈ భవనంలో ఏర్పాటు చేసేందుకు ఐదు అంతస్తులుంటేనే వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక్క అంతస్తే నిర్మించిన ప్రస్తుత భవనం ఎటూ సరిపోక నిరుపయోగంగా మారిందని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ అన్నారు.
ప్రణాళిక లోపం
ఐదు అంతస్తుల నిర్మాణాలకు నిర్ణయం తీసుకున్నా.. ఒక అంతస్తుకే నిధులు అయిపోవడంపై రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ.10కోట్లతో నిర్మించిన భవనం ప్రణాళిక లోపంతో వృథాగా మిగిలింది. గతంలో కంటే ప్రస్తుతం మాతా శిశు ఓపీ రెండింతలు కావడం వల్ల కొత్త భవనం సరిపోని పరిస్థితి ఏర్పడింది. అదనపు అంతస్తుల నిర్మాణం కోసం నివేదించినా ఎలాంటి స్పందన లేదని అంటున్నారు.
అప్పుడే పగుళ్లు...!
ఇప్పటికే భవనం నిర్మించి రెండేళ్లు కావడం వల్ల అక్కడక్కడా పగుళ్లు ఏర్పడుతున్నాయి. మరింత కాలం వృథాగా వదిలేస్తే భవనం నిర్వహణ లేక పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది. కొత్త భవనంలోకి మాతా శిశు కేంద్రాన్ని మార్చి సద్వినియోగం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి :వివాదాస్పదమైన జాతీయ వైద్యకమిషన్ చట్టం