MLC Kavitha On Irrigation Day In Nizamabad : కేసీఆర్ అంటే కాల్వలు.. చెక్ డ్యాంలు.. రిజర్వాయర్లని, కేసీఆర్‌ను కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‌లోని దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తాతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేంద్రం కాళేశ్వరం గురించి గర్వంగా చెప్పుకునేలా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం సంతోషమని ఆమె పేర్కొన్నారు.
కాలువలు తవ్వి వేల కోట్లు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్.. ఎంత బాధ పడేవారో ఆయన కన్నబిడ్డగా తెలుసని ఆవేదన చెందారు. కేసీఆర్‌ది తెలంగాణ రైతుల పట్ల కన్నతల్లి ప్రేమ అని అన్నారు. కలలు కన్న తెలంగాణ.. ఈరోజు మిలమిలా మెరుస్తుంటే చాలా సంతోషంగా ఉందని సంతోషించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ వినాయక్ నగర్‌లోని బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు.
MLC Kavitha Comments On CM KCR : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత కేసీఆర్‌కి మాత్రమే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాల్లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండి పడ్డారు. ఇక్కడ నిజం చెప్తే గౌరవిస్తాం.. అబద్ధం చెప్తే ఉరుకోబోమని ఆమె హెచ్చరించారు. ఎవరెస్టు శిఖరం లాంటి కేసీఆర్ మనకు ఉన్నారని.. నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగువేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
"కేసీఆర్ అంటేనే కాలువలు, చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు. కేసీఆర్ అంటేనే నీరు. కేసీఆర్ అంటేనే అమ్మతీరు. ఎందుకంటే ఆయన బిడ్డగా దగ్గరుండి చూశాను. తెలంగాణ ఉద్యమంలో జిల్లాలు తిరిగి వచ్చి దుఃఖంతో ఉండేవారు. పాలమూరు తల్లి పైట కప్పుకున్నదని రాసిన వక్త కేసీఆర్. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రైతుల పట్ల తల్లి ప్రేమ కేసీఆర్‌ది." - కవిత, ఎమ్మెల్సీ
కవిత మళ్లీ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారు : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కవిత నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తారని.. భారీ మెజారిటీతో గెలిపించుకుందామని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తెలిపారు. కవిత ఓటమితో నిజామాబాద్ అభివృద్ధిలో ఐదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని.. ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ కవితను పార్లమెంటు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నిజామాబాద్ వాసులకు విజ్ఞప్తి చేశారు.