MLC Kavitha fires on BJP: తెలంగాణ నేతలది భయపడే తత్వం కాదని.. పక్కాగా వ్యాపారం చేస్తాం కాబట్టి వెనకంజ వేయమని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు ప్రలోభాలు, ఈడీ, ఐటీ కేసులతో ఇతర పార్టీల వాళ్లను చేర్చుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సిట్ విచారణకు పిలిస్తే భాజపా నేతలకు ఎందుకు అంత ఉలుకని వ్యాఖ్యానించారు. తప్పు చేయకపోతే బీఎల్ సంతోష్‌కు భయమెందుకు అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనడానికి వస్తే అరెస్టు చేయవద్దా అని అన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండలం తాండూరులో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు.
బీజేపీది రామ్ రామ్ జప్ నా.. పరాయి లీడర్ అప్నా సిద్ధాంతం : రామ జపం తప్ప బీజేపీ చేసిందేమీ లేదనీ.. రాముడి పేరు చెప్తూ రౌడీయిజం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీజేపీది రామ్ రామ్ జప్ నా.. పరాయి లీడర్ అప్నా అన్న సిద్దాంతమని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వాళ్లకు అభ్యర్థి లేడని అన్నారు. ఐటీ, ఈడీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు. నిజాయితీగా వ్యాపారాలు చేసే వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి : ఎమ్మెల్యేలకు ఎర కేసులో బండి సంజయ్ దొంగ ప్రమాణాలు చేశారన్న కవిత.. దొంగ ఏడుపు ఏడుస్తున్నారనీ ఆరోపించారు. తప్పు చేయనప్పుడు బీజేపీ నేత బీఎల్ సంతోష్ విచారణకు ఎందుకు రావడం లేదనీ ప్రశ్నించారు. రైతు బంధును నఖలు కొట్టి పీఎం కిసాన్ తెచ్చారని... రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు లబ్ధిదారులను పెంచుకుంటే.. కేంద్రం రాష్ట్ర రైతులకు ఇచ్చే నిధి తగ్గించిందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదన్నారు. వచ్చే ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని... అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
ఇవీ చదవండి: