MLC Kavitha Campaign in Nizamabad : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయినందున.. రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో సిద్ధమవుతున్నాయి. నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచార సభ ప్రారంభించారు. గౌడ సంఘం(Gouda Atmiya Sabha) ఆధ్వర్యంలో నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రేణుక ఎల్లమ్మ సమక్షంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నిజామ్ కాలం నుంచి ఉందని.. మిషన్ భగీరథ పథకంతో ఆ సమస్యను కేసీఆర్ ప్రభుత్వం తగ్గించిందని గుర్తు చేశారు.
MLC kavitha Nizamabad Tour : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు పరిపాలించిన పార్టీలు మద్యం ఆదాయం గండిపడుతుందని.. నీరాని అంతగా ప్రోత్సహించలేదని కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన తరవాత కేసీఆర్ హైదరాబాద్లో నీరా షాపులు పెడతామని చెప్పి.. మాట నిలబెట్టుకున్నారని అన్నారు. దీనివల్ల 70 వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. కులవృత్తి అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. మద్యం దుకాణాలు టెండరు నిర్వహిస్తే గౌడ కులస్థులకు 15 శాతం కేటాయించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
"ప్రతి కాల్వ మీద తాటి, ఈత చెట్టును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్దార్ పాపన్న జయంతి ప్రభుత్వం అధికారికంగా చేయడానికి నిర్ణయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. బీసీల ప్రభుత్వం."- కవిత, ఎమ్మెల్సీ
MLC Kavitha Participating in Gouda Atmiya Sabha : డిసెంబర్ 3న గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే అని కవిత ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 2014కి ముందు అనేక సార్లు అధికారంలోకి వచ్చిందని.. నిజామాబాద్లో బీసీ హాస్టల్ ఒకటి మాత్రమే కట్టించారని తెలిపారు. బీఆర్ఎస్ వచ్చిన 10 ఏళ్లలో 15కు పెంచారని గుర్తు చేశారు. కల్యాణ లక్ష్మి పథకం(Kalyani Lakshmi Scheme) ద్వారా బీసీలకు ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని.. బీసీల ప్రభుత్వమన్నారు. ఎన్నికల ప్రచారానికి ఇతర పార్టీలు వస్తాయని.. వారిని నిజామాబాద్లో బీసీ హాస్టల్ ఒకటే ఎందుకు కట్టారని ప్రశ్నించాలని ఆమె సూచించారు. నగరంలో రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ.75 లక్షలు కేటాయించామని.. 20 శాతం పరిహారం చెల్లించక ఆగిపోయిందని.. అది చెల్లించిన వెంటనే ఆ నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి గణేశ్ గుప్తా పాల్గొన్నారు.