నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్‌నగర్ వద్ద మిషన్ భగీరథ పైపు లైన్ లీక్ అయింది. దీంతో ఒక్కసారిగా నీరు పైకి ఎగిసి పడింది. దీంతో సమీప ఇళ్లలోకి మంచి నీరు వరదలా చేరింది. అరగంటకు పైగా నీరు లీకేజీ కావడంతో రహదారి జలమయం అయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
పెద్ద పైప్‌లైన్ కావడంతో నీరు వరదలా పారింది. సమీప ఇళ్లలోకి మోకాళ్లలోతు వరకు నీరు చేరింది. దీంతో ఇళ్లలోని సామగ్రి నీట మునిగిపోయాయి. ఒక్కసారిగా వరదలా వచ్చి చేరిన నీటితో ఇళ్లలోని వస్తువులను ఎలా రక్షించుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన తమ వస్తువులకు పరిహారం అందించాలని కోరారు.
బాల్కొండ మండలం జలాల్‌పూర్ శివారులో నుంచి శ్రీరాంసాగర్ వెనుక జలాలను తాగు నీటి కోసం కామారెడ్డి నియోజకవర్గంతో పాటు, ఎల్లారెడ్డిలోని కొన్ని మండలాల గ్రామాల ప్రజలకు తాగు నీటిని అందించే ఈ పైప్‌లైన్ పలుమార్లు లీకేజీ అయింది. మరోసారి లీక్ కాకుండా మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరారు.
ఇదీ చదవండి : ఏవియేషన్ షోలో చివరిరోజు సందర్శకుల సందడి.. ఆకట్టుకున్న ఎయిర్ షో..