నకిలీ విత్తనాలు తయారు చేసినా, సరఫరా చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాలు శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Prashanth reddy) అధికారులు, పోలీసులకు సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులతో విత్తనాలు, ఎరువులు, తెలంగాణకు హరితహారం పథకంపై సమీక్షించారు. వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు.
నకిలీ విత్తనాలు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని.. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి అక్రమార్కుల పని పడుతోందని మంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చాక విత్తన, ఎరువుల కొరత లేకుండా సీఎం కేసీఆర్ (Cm Kcr) జాగ్రత్తగా వ్యవహరించారని పేర్కొన్నారు.
తెలంగాణకు హరితహారం పథకంతో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని.. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని మంత్రి చెప్పారు. ఈ ఏడాది అధికారులు, సిబ్బంది ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సమీక్షలో నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Petrol Protest: పెట్రో ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్