Minister KTR fire on Narendra Modi: నిజామాబాద్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్‌మెంట్ డైలాగ్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్ అనే అంశంపై మాట్లాడారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు. అనంతరం రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించిందని.. ఈ ప్రాజెక్టుపై అవగాహన లేనివారు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
అనంతరం పాత కలెక్టరేట్ వద్ద ఇందూరు కళాభారతి భవనానికి శంకుస్థాపన చేశారు. 50 కోట్ల నిధులతో నిర్మించే కళాభారతి.. కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, రచయితలు, పిల్లలకు చక్కటి అపురూపమైన కానుకని పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదిన్నరేళ్లలో జిల్లా అభివృద్ధికి 936 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. కొత్తగా 100 కోట్ల రూపాయలు అభివృద్ధికి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం 21 కోట్లతో నిర్మించిన కంటేశ్వర్ రైల్వే అండర్ బ్రిడ్జిని కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం నిజామాబాద్ జిల్లా భారాస కార్యాలయంలో విలేకరులతో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని అన్నారు. మాటల్లో సబ్ కా సాథ్ అంటున్న కేంద్రం.. చేతల్లో మాత్రం సబ్ కుచ్ బక్వాస్ అని విమర్శించారు. ఎనిమిదిన్నరేళ్లయినా రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక్క రూపాయి నిధులివ్వలేదని.. ఒక్క విద్యాసంస్థ కొత్తగా ఇవ్వలేదని మండిపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని.. చిత్తశుద్ది ఉంటే తెలంగాణా కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
పసుపు బోర్డు ఇస్తామని చెప్పిన కేంద్రం ఉన్న జ్యూట్ బోర్డును ఎత్తేసిందని విమర్శించారు. దేశం మొత్తానికి ఉచిత విద్యుత్ ఇస్తే ఏటా రూ. లక్షా 45వేల కోట్లు ఖర్చవుతుందని దీనికి మోదీ ససేమిరా అంటూ బడా బాబులకు మాత్రం 12లక్షల కోట్ల రుణాలు మాఫీ చెయ్యలేదా అని ప్రశ్నించారు. కేంద్రం పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తే తామూ సిద్ధమేనని కేటీఆర్ సవాల్ విసిరారు. బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. నెల రోజుల్లో ఐటీ హబ్, న్యాక్ భవనాన్ని ప్రారంభిస్తామని కేటీఆర్ ప్రకటించారు.
"కేంద్రానికి దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు రావాలి.. మేము కూడా ముందస్తు ఎన్నికలకు వస్తాం. నెల రోజుల్లో ఐటీ హబ్, న్యాక్ భవనాన్ని ప్రారంభిస్తాం. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.936 కోట్లు ఖర్చు చేశాం. నిజామాబాద్‌కు అర్వింద్.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకోచ్చారు. పన్నుల రూపంలో మనం కట్టిన డబ్బులను బీజేపీ పాలక రాష్ట్రాల్లో వాడుకుంటున్నారు. నేను చెప్పింది తప్పు అయితే రాజీనామాకు సిద్ధం. మనం రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించాం. తెలంగాణలోని రైతుల్లో ఆశలు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. 24 గంటల విద్యుత్ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం."- కేటీఆర్, ఐటీశాఖ మంత్రి
ఇవీ చదవండి: