మెదక్ జిల్లా కలెక్టరేట్లో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలకు రక్తహీనత లేకుండా అవసరమైన పోషక పదార్థాలు అందేలా చూడాలన్నారు. అవసరమైన పోషక పదార్థాలను అందించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని చెప్పారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అవసరమైన పోషక పదార్థాలను అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ విషయంలో అంగన్వాడీ కేంద్రాలు, టీచర్ల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. గర్భిణులు, బిడ్డకు రెండేళ్లు నిండే వరకు అవసరమైన పోషక పదార్థాలు అందించాలన్నారు. గర్భిణీగా ఉన్న సమయంలోనే పౌష్టికాహారం అందచేస్తే ఆరోగ్యంగా ఉండే పిల్లలు పుడతారని వివరించారు. రక్తహీనత విషయంలో మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి రసూల్‌బీ, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, డీఈవో రమేష్‌కుమార్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో యువకుడు మృతి