కరోనా నిర్ధరణ అయినప్పటికీ భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మందుల ద్వారా కోలుకోవచ్చని ప్రజలకు ధైర్యం చెప్పారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించటానికి చేపట్టిన ఫీవర్ సర్వేను ఆమె శుక్రవారం పరిశీలించారు.
నగరంలోని 300 క్వార్టర్స్, ఇబ్రహీం నగర్, దొడ్డికొమరయ్య కాలనీల్లో జరుగుతున్న ఫివర్ సర్వేను మేయర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ఇంట్లో విడిగా ఉండే సౌకర్యాలు లేకపోతే మున్సిపాలిటీ వారు నగరంలో రెండు ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారని ప్రజలకు తెలియజేశారు. వాటిని ఉపయోగించుకుని కుటుంబ సభ్యులకు, ఇతరులకు మహమ్మారి సోకకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ వెంట స్పెషల్ ఆఫీసర్ రమేశ్, ఉత్తర మండల ఎంఆర్‌వో, ఎస్.ఆర్.నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ సామ్రాట్, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆంక్షలను కఠినంగా అమలు చేయాలి: సీఎం కేసీఆర్