నెల మొదలైంది. వివిధ అవసరాల నిమిత్తం జనాలు రోడ్లపైకి రావడం పెరిగింది. రేషన్, కిరాణా, బ్యాంకు పనుల నిమిత్తం బయటకు వస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, అధికారులు ఎంత చెబుతున్నా చెవికెక్కించుకోవడం లేదు. నిజామాబాద్ నగరంలో ఆదివారం ఉదయం మార్కెట్లు జనంతో కిటకిటలాడాయి. ముఖ్యంగా కూరగాయల మార్కెట్, గోదాంరోడ్డు, మాంసం దుకాణాలు, అహ్మదీబజార్, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిన తిరిగారు.
తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరికే ఉండవంటారు. నిజామాబాద్‌లో పరిస్థితి చూస్తే ఈ సామెతనే తలపిస్తోంది. ఎంత చెబుతున్నా కొందరు రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. విసుగెత్తిన పోలీసులు నోటికి, లాఠీకి పని చెబుతున్నారు. నెహ్రూచౌక్‌లో రాకపోకలపై ఆంక్షలు పెట్టినా కొంతమంది వాహనాలను ఇష్టమొచ్చినట్లు నడుపుతున్నారు. ఆదివారం ఓ ద్విచక్ర వాహనదారుడు పోలీసుల ముందే మరో ద్విచక్ర వాహనదారున్ని ఢీకొట్టాడు. అతన్ని అదుపులోకి తీసుకొని వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అవసరమైన సందర్భాల్లో పోలీసులు లాఠీలతో పౌరులకు బాధ్యత గుర్తు చేస్తున్నారు. కరోనాతో కలిగే అపాయం గురించి వివరిస్తున్నారు.
ఇవీ చూడండి: 'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'