కరీంనగర్ నుంచి నిజామాబాద్ వరకు 2016 డిసెంబరులో నూతన రైల్వేలైను ప్రారంభించారు. మొదట్లో పుష్పుల్ రైలు నడిపారు. తర్వాత కాచిగూడ నుంచి నిజామాబాద్ వెళ్లే రైలును కరీంనగర్ వరకు పొడిగించారు. ప్రజల సౌకర్యం కోసం ఈ మార్గంలో తొమ్మిది రైల్వే స్టేషన్లను నిర్మించారు. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే మొదలైంది. స్టేషన్లు నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టలేదు. కనీస వసతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలంకార ప్రాయంగా ఉన్న నిర్మాణాలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.
అధ్వానంగా మెట్పల్లి స్టేషన్
మెట్పల్లి రైల్వే స్టేషన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తుప్పల మధ్యలో స్టేషన్ నిర్మాణం చేశారా అన్నట్టుగా పిచ్చి మొక్కలు మొలిచాయి. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో స్టేషన్ ఉండడం వల్ల మంచి నీరు, విద్యుత్ సౌకర్యం లేక మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. భద్రత లోపంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నదంటూ స్థానికులు వాపోతున్నారు. పాలకుల పట్టిపు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కరవై కొత్త స్టేషన్లలో అభివృద్ధి కుంటుపడింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. కనీస వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: గేటు పడిందా... అరగంట ఆగాల్సిందే..!