నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పెద్దగుట్టకు ఏటా వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఫిబ్రవరిలో నిర్వహించే ఉర్సుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా హాజరవుతుంటారు. నిర్వహణ బాధ్యతలకు టెండర్లు నిర్వహిస్తారు. వచ్చిన ఆదాయం వక్ఫ్ బోర్డుకు వెళ్తోంది. ఈ ఏడాది ఆదాయం రూ.3.60 కోట్లకు చేరింది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించడం లేదు.
పర్యవేక్షణ కరవు
2016-17, 2017-18 మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఏటా రూ.20 లక్షల ఆదాయం వచ్చింది. నిర్వహణ బాధ్యతలు తీసుకున్న వ్యక్తులు భక్తులను పిండేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇష్టానుసారం వసూల్ చేస్తున్నారు. దుకాణాలు, అద్దె గదులు, కందూరు తదితర అంశాలకు వసూలు చేసే ధరలకు ఓ లెక్కాపత్రం లేకుండా పోయింది. ధరల బోర్డులు ఎక్కడా కనిపించవు. ఇక్కడ యాభై వరకు దుకాణాలు ఉన్నాయి. వాటికి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు.
ప్రతి ఏడు ఇదే గోస
పెద్దగుట్టకు వెళ్లే మెట్ల మార్గం అధ్వానంగా మారింది. మెట్లన్నీ ధ్వంసమై రాళ్లు తేలాయి. వీటిపై నడవలేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మంచినీటి సౌకర్యం ఎక్కడా ఉండదు. కొనుగోలు చేయాల్సిందే. వసతి కోసం తీసుకునే గదుల అద్దెలు భారీగా ఉన్నాయి. వసతులు మాత్రం ఉండవు. మూత్రశాలలకు, వాహనాల పార్కింగ్‌కు చెల్లింపులు తప్పనిసరి. ప్రతి ఏటా ఇవే సమస్యలు ఎదుర్కొంటున్నా ఏ ఒక్కటీ పరిష్కారం కావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరికి చెప్పాలి
బడా పహాడ్‌కు వచ్చిన భక్తులు తమ సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారు. ఎవరికైనా చెబుదామంటే అధికారి కార్యాలయం గానీ, సిబ్బంది గానీ ఎవ్వరూ కనిపించరు. కనీసం వక్ఫ్ బోర్డు అధికారుల ఫోన్ నంబర్లు గానీ, టోల్ ఫ్రీ, లేదంటే మొబైల్ నంబర్లు కానీ ఎక్కడా ఉండవు. తాగే నీళ్ల నుంచి దేవుడి నైవేద్యం తయారీ వరకూ అన్నిచోట్లా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. పిల్లల బొమ్మలు, టిఫిన్లు, శీతల పానీయాలు, పూజాసామాగ్రి, వంట సామాగ్రి.. ఇలా ఏది ముట్టుకున్నా ఇష్టమొచ్చిన ధరకు అమ్ముతున్నారు. ఇదేంటని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
వసూళ్లున్నా.. వసతుల్లేవ్
బడా పహాడ్ పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంటుంది. శుక్ర, ఆదివారాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. తెలంగాణలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే దర్గాగా పేరున్నప్పటికీ పోలీస్ అవుట్ పోస్టు కూడా ఏర్పాటు చేయలేదు. ఏళ్లుగా అవుట్ పోస్టు ఏర్పాటు డిమాండ్ ఉన్నా సంబంధిత చర్యలు చేపట్టలేదు. కేవలం ఉర్సు ఉత్సవాలకే సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. కేవలం గుట్టపైన దర్గా వద్ద మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా అవి కూడా సక్రమంగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. గతంలో ఈ గుట్ట పరిసరాల్లో గుర్తు తెలియని మృతదేహాలు లభించినా.. పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
మౌలిక సదుపాయాలు కల్పించి భద్రత చర్యలు చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం పెద్దగుట్టపై దృష్టి సారించి వసతలు కల్పిస్తే.. ఇదొక పర్యటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.
- ఇదీ చూడండి : వీడియో కాల్‌తో లక్షలు దోచేస్తున్నారు...