ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ఐసీయూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సమయంలో ప్రతిరోజు ఐదు నుంచి పది మంది రోగులను హైదరాబాద్ వెళ్లాలని సూచించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా, నయా పైసా చెల్లించే అవసరం లేకుండా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే అత్యాధునిక వెంటిలేటర్లతో ఆరు పడకల ఐసీయూ ఏర్పాటు చేశారు. ఐసీయూ ప్రారంభమైన నెల రోజుల్లో 45 మందికి అత్యవసర సమయంలో చికిత్స చేశారు.
పాము కాటు, విషం తాగడం, ఇతర ప్రమాదకరమైన పదార్థాలు సేవించిన వారి పొట్ట శుభ్రం చేసేందుకు సక్షన్ ఆపరేటర్ యంత్రం, గుండె పరిస్థితి, నాడి కొట్టుకోవడం, బిపి తదితర వివరాలు తెలిపేందుకు మానిటర్లు అందుబాటులో ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో ఐసీయూను ఏర్పాటు చేయడంతో సామాన్య ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందుతోందని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.