ఆదిలాబాద్ జిల్లాలో ఓ బాలిక దీనస్థితిపై ఈటీవీ భారత్‌లో ప్రత్యేక కథనానికి (Response to Etv Bharat Story)పలువురు దాతలు స్పందిస్తున్నారు. పేదరికంతో చదువుకు దూరమయ్యే పరిస్థితుల్లో ఉన్న శ్రీనిజకు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు వస్తున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ శ్రీనిజను ఆదుకునేందుకు ముందుకచ్చారు.
నిజామాబాద్‌లో తన బంధువుల ఇంట్లో ఉన్న శ్రీనిజను కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు రూ. 70వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. ఇదే కాకుండా భవిష్యత్తులో ఆమె చదువులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు భరోసా కల్పించారు. శ్రీనిజకు తాము 300 మంది అన్నయ్యలు ఉన్నామని... ఎలాంటి కష్టం వచ్చినా సమాచారం అందిస్తే ఆదుకుంటామని అసోసియేషన్ సభ్యులు సూచించారు. ఇదేస్ఫూర్తితో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటానని శ్రీనిజ తెలిపింది.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీనిజ కుటుంబ పరిస్థితి సరిగా... లేక ఆమె పైచదువుల కోసం ఆర్థికసాయం అందించాలని ఈటీవీ సంస్థకు సంబంధించిన మీడియాలో కథనం చదివాము. దీంతో శ్రీనిజకు ఎలాగైనా సాయం చేయాలని ఆమె వివరాలు తెలుసుకున్నాం. నిజామాబాద్‌లోని తన బంధువుల ఇంట్లో ఉందని తెలిసి నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి ఇక్కడికి వచ్చాం. హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ తరుపున రూ. 70వేల ఆర్థికసాయం అందజేశాము. శ్రీనిజకు తాము అన్న లాంటి వాళ్లం... ఎలాంటి కష్టం వచ్చినా సమాచారం అందిస్తే ఆదుకుంటాం. -అన్వేశ్‌రెడ్డి, హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ప్రతినిధి
నాన్నేమో అనారోగ్యంతో మంచం పట్టాడు. అమ్మేమో వంట మనిషిగా కుటుంబ భారం మోస్తుంది. వారి కష్టాలను దూరం చేయాలనుకుంటున్న శ్రీనిజ... పైచదువులు చదివేందుకు పేదరికం అడ్డుగా మారింది. దీంతో ఆ బాలిక దీన స్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనాన్ని అందించగా దేవరకొండకు చెందిన హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ శ్రీనిజను ఆదుకునేందుకు ముందుకచ్చారు.
ఇదీ చదవండి: అయ్యో బిడ్డలారా.. ఎంత కష్టం! చూడలేరు.. నడవలేరు.. మాట్లాడలేరు..