Heavy Rains In Nizamabad District : భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. 46.3సెంటిమీటర్ల రికార్డుస్థాయి వర్షంతో వేల్పూరు మండలంలో ఊరు-ఏరూ ఏకమైంది. మర్సుకుంట, కాటి చెరువులు తెగిపోయాయి. సమీపంలోని రోడ్డుపై వరద పోటెత్తింది. ప్రవాహ ఉద్ధృతితో ఆర్మూర్-భీంగల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వేల్పూరు పోలీస్ స్టేషన్, గ్రామాభివృద్ధి కమిటీ, తహసీల్దార్ కార్యాలయాలు, రైతు వేదికల్లోకి వరద నీరు చేరింది.
చెరువులు తెగి సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఒకానొక సమయంలో మోకాలిలోతు నీరు వచ్చిందని స్థానికులు తెలిపారు. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయి సరఫరా నిలిచిపోయింది. పంటపొలాలు నీటమునిగి.. ఇసుక మేటలు వేసింది. వేల్పూర్ మండలంలో దాదాపుగా 100ఎకరాలకు నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు.
గతేడాది రూ.60 లక్షల మదుపు.. మళ్లీ తొలగింపు : పెర్కిట్, బీమ్‌గల్, కోన సముందర్, జక్రాన్‌పల్లి, కోరట్‌పల్లి, మోర్తాడ్, ధర్పల్లి ఆలూర్, మచ్చర్లలోనూ భారీవర్షం కురిసింది. పచ్చలనడుకుడ వద్ద రోడ్డు కుంగిపోయింది. జక్రాన్ పల్లి మండలం పడకల్ పెద్ద చెరువుకు ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు అలుగును తొలగించారు. గతేడాది తెగిపోవడంతో60 లక్షల వ్యయంతో కట్ట బాగు చేయగా.. మళ్లీ కుంగిపోవడంతో మత్తడిని తొలగించారు.
నిండుకుండలా మారిన రామడుగు ప్రాజెక్టు : రామడుగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. డిచ్‌పల్లి, ఇందల్వాయి, మోపాల్, సిరికొండ, ధర్ పల్లి, జక్రాన్ పల్లిలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. సిరికొండలో కప్పలవాగు వంతెనపై నుంచి ప్రవహించింది. సాయిబాబా గుడి సమీపంలో జాతీయ రహదారి కోతకు గురైంది. పెర్కిట్ శివారులో 44, 63 జాతీయ రహదారులు కోతకు గురయ్యాయి. ఆర్మూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రధాన సీసీ రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. పెర్కిట్‌లో వరదనీటి ప్రవాహానికి కరెంటు ట్రాన్స్ ఫార్మర్ కొట్టుకుపోయింది. చేపూర్‌లో రోడ్డు కోతకు గురై.. మెట్ పల్లి నుంచి ఆర్మూర్ వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్మూర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, యోగేశ్వర కాలనీలో వరద నీరు ఇళ్లలోకి చేరింది.
"అదృష్టవశాత్తు వేల్పూరు మండలంలో 4 నుంచి 6 చెరువులు పూర్తిగా నిండాయి. ఆనీరు రోడ్ల మీదకు వస్తున్నాయి. రోడ్లు కూడా తెగిపోవడం జరిగింది. రైతులు పంటలు నష్టపోయారు. అదే కొంచెం బాధగా ఉంది. ఈ మండలంలో 46 సెం.మీ వర్షపాతం అనేది నిజామాబాద్ చరిత్రలోనే రాలేదు. అధికారయంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది." - ప్రశాంత్ రెడ్డి, మంత్రి
Vailpur Receives Most Rainfall In Nizamabad : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాడ్వాయి మండలం కామారెడ్డి నుంచి బ్రహ్మణపల్లి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న బ్రిడ్జి తెగిపోయింది. గాంధారి మండలం నల్లమడుగు- రామలక్ష్మన్ పల్లి గ్రామాల మధ్య వాగు పొంగి వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వేల్పూర్‌లో వర్ష ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్‌తో కలిసి మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ, రోడ్ల మరమ్మతులపై అధికారులతో చర్చించారు.
ఇవీ చదవండి :