ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. పలుచోట్ల చెరువులు అలుగు పోస్తుండగా.. ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి.
కామారెడ్డి జిల్లాలో
కామారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఈ నేపథ్యంలో 6 గేట్లు ఎత్తి 19,942 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు 20,014 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 457.90 మీటర్లు ఉండగా.. పూర్తిస్థాయి నీటి మట్టం 458 మీటర్లుగా ఉంది.
అలుగు పోస్తోన్న పోచారం..
రాత్రి వర్షాలకు నాగిరెడ్డి పేట్ మండలం పోచారం ప్రాజెక్టు నిండి అలుగు పారుతోంది. పిట్లం మండలంలో కాకి వాగు పొంగి పొర్లుతోంది. కంభాపూర్-గోద్మెగావ్ మధ్య వంతెనపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా పంటలు నీట మునిగాయి. పిట్లం మండలం తిమ్మానగర్, ఫతేపూర్, హస్నాపూర్ వద్ద వంతెనపై నుంచి నల్లవాగు పొంగుతోంది.
![భారీ వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8804748_195_8804748_1600147379536.png)
మత్తడి దూకుతోన్న సితాయిపల్లి చెరువు..
గాంధారి మండలం సీతాయిపల్లి చెరువు అలుగు పారుతోంది. రాత్రి వర్షానికి ఏడుమోట్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
రెండోసారి తెగిన వంతెన..
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు వద్ద తాత్కాలిక వంతెన రెండోసారి తెగిపోయింది. భారీ వర్షాలకు తాత్కాలిక వంతెన తెగిపోగా మరమ్మతులు చేశారు.
ఇవీ చూడండి : నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. దిగువకు నీటి విడుదల