నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రైతన్న విలవిల్లాడిపోయాడు. పంట చేతికొచ్చిందన్న ఆనందమే లేకుండా దిగులు చెందుతున్నాడు. అల్పపీడనం వల్ల నిజామాబాద్ గ్రామీణ, డిచ్‌పల్లి, మాక్లూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.
ఈ ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు ముందుగా వేయడం వల్ల తొందరగా చేతికొచ్చాయి. ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో ఆరుబయటే ధాన్యం నిల్వ ఉంచాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.