Crop loss in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వందలాది ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట నేలవాలగా.. వేలాది ఎకరాల్లో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. సుమారు 20 కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. సుమారు 5 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి.. వరి, సజ్జ, జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సగటున 8.9 మిల్లీ మీటర్ల వర్షం నమోదుకాగా.. అత్యధికంగా ఇందల్వాయిలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ రూరల్, ఏర్గట్ల, మోపాల్, నవీపేట, ఎడపల్లి, డిచ్‌పల్లి, ధర్పల్లి, ఇందల్‌వాయి, జక్రాన్‌పల్లి, భీమ్‌గల్, నందిపేట, మాక్లూర్, బోధన్, సిరికొండ మండలాల పరిధిలో పంటలకు నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో వాటిల్లిన నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వర్షం కడగండ్లు మిగిల్చింది. బాన్సువాడ, లింగంపేటలో అరగంట పాటు రాళ్ల వాన కురిసింది. ఫలితంగా వేలాది ఎకరాల్లో పంట నేలవాలింది. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంతో రైతులు.. ఆ పంటను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. లింగంపేటలో ఓ మహిళా రైతు వడగండ్లతో తన పంట నష్టం చూసి.. బోరు బోరున విలపించింది. పిట్లం, బిచ్కుందలో భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి.
Heavy rains in Nizamabad: లింగాయపల్లి- కోటాలపల్లి రహదారిపై రైతులు రాస్తారోకో చేసారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆందోళనకు దిగారు. ఎల్లారెడ్డిలో వడగండ్ల వర్షానికి ఓ షెడ్డులో ఉన్న 14 మేకలు మృత్యువాత పడ్డాయి. అకాల వర్షాలతో రైతులు భారీగా నష్టపోయారు. లింగంపేటలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది.
పంట నష్టాన్ని పరిశీలించిన స్పీకర్: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిజామాబాద్ జిల్లా దిచిపల్లి మండలంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పంటలను పరిశీలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడుకోల్ గ్రామంలో నిన్న కురిసిన వడగళ్ల వర్షానికి నష్టపోయిన పంటలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కామారెడ్డి మండలం పొందుర్తి, నరసన్నపల్లి గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరిశీలించారు.
రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కలెక్టరు జితేశ్ పాటిల్ పంటలు దెబ్బ తిన్న ప్రాంతాల్లో పర్యటిచారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులకు కంటి మీద కునుకు కరవైంది. మరో మూడు రోజుల పాటు జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించగా.. రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి:
అకాల వర్షాలకు రైతు కుదేలు.. నోటికాడి ముద్ద చేజారిపోయే..
ఆరుగాలం పండించిన పంట వర్షార్పణం
నగరంలో రికార్డు స్థాయి వర్షం.. హుస్సేన్‌సాగర్‌లో తప్పిన ప్రమాదం