Farmers Maha Padayatra: రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన మహాపాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్‌పల్లి మండలం నుంచి యాత్ర ప్రారంభమైంది. ప్రతి పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించి.. కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రకటించిన ధరకు కొనుగోలు చేయలేకపోతే నిరసన చర్యలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దిల్లీలో రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ పాదయాత్ర చేపట్టామని తెలిపారు.
మూతపడ్డ మూడు చక్కెర కర్మాగారాలతో పాటు ఓ సహకార ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులు డిమాండ్ చేశారు. మొక్కజొన్న, ముడి బియ్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా రైతు వేదిక, జగిత్యాల జిల్లా రైతు ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ముత్యంపేట్ నుంచి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ వరకు యాత్ర కొనసాగనుంది. పెద్ద ఎత్తున రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు.
"ప్రతి పంటను ఎంఎస్పీలో చేర్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేదంటే చర్యలు ఉద్ధృతం చేస్తాం. దిల్లీ రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పాదయాత్ర చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేయాలి. మూతపడ్డ చక్కెర కర్మాగారాలతో పాటు ఓ సహకార ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తున్నాం." -రైతులు
ఇదీ చదవండి: తెలంగాణలోని పథకాలు దేశంలో ఎక్కడా లేవు: సత్యవతి రాఠోడ్