నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత చొరవతో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 30 మంది విద్యార్థులు తమ స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి జైనథ్ మండలం డొల్లార సమీపంలోని పెన్‌గంగ సరిహద్దుకు చేరుకోగానే తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్‌రావుకు ఆదివారం రాత్రి కవిత ఫోన్ చేసి విద్యార్థులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
కవిత సూచన మేరకు జైనథ్ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌తో కలిసి రంగినేని శ్రీనివాస్‌రావు భోజనాలు పెట్టి ఆకలి తీర్చారు. వీరంతా మహారాష్ట్రలోని అమరావతికి వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలో శిక్షణ పొందేందుకు లాక్‌డౌన్ కంటే 15 రోజుల ముందు వెళ్లారు. లాక్‌డౌన్‌లో భాగంగా అక్కడి అధికారులు ఓ హాస్టల్ క్వారంటైన్‌లో ఉంచారు. కష్టాలు పడుతున్నామని ఇక్కడి నుంచి స్వస్థలాలకు పంపించేలా ఏర్పాటు చేయాలని విద్యార్థులు కవితకు సందేశం పంపించారు. స్పందించిన ఆమె విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేలా రెండు బస్సులను ఏర్పాటుచేశారు.