నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చిన్నారెడ్డికి గత ఏడాది డిసెంబరులో క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది. మూడు నెలల క్రితం కంపెనీ నుంచి తనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోడానికి అతను దుబాయ్ వెళ్లాడు. అయితే కేవలం 15 రోజులకు సరిపడా మందులు మాత్రమే తీసుకెళ్లిన చిన్నారెడ్డికి లాక్డౌన్ రూపంలో కష్టాలు మొదలయ్యాయి. దుబాయ్‌లో మందులు దొరక్క, కీమోథెరపీ జరగక ఇబ్బందులు పడ్డాడు. ఇండియా కూడా వచ్చేందుకు అవకాశం లేకపోవడం వల్ల తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు.
అతని అనారోగ్యం విషయం తెలుసుకున్న అతని భార్య, తల్లి, ఇద్దరు కూతుళ్లు కన్నీరు మున్నీరవుతూ సహాయం కోసం ఎదురుచూశారు. తనను ఆదుకోవాల్సిందిగా, ఇండియా వెళ్లేందుకు సహాయం చేయాల్సిందిగా మాజీ ఎంపీ కవితను సోషల్ మీడియాలో వీడియో ద్వారా చిన్నారెడ్డి కోరాడు. మరోవైపు ఇదే విషయమై కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ కూడా ఈ విషయమై కవితను సంప్రదించారు.
దీనిపై వెంటనే స్పందించిన ఆమె దుబాయ్‌లోని ఈటీసీఏ నాయకుడు కిరణ్ ద్వారా చిన్నారెడ్డికి సహాయసహకారాలు అందించారు. ఫ్లైట్ టికెట్ బుక్చేయించి స్వస్థలానికి చేర్చారు. కాగా చిన్నారెడ్డి తీవ్ర అనారోగ్యం దృష్ట్యా, స్వగ్రామంలో హోం క్వారంటైన్లో ఉండేందుకు అధికారులు అనుమతించారు. అడిగిన వెంటనే స్పందించి, ఇండియా వచ్చేందుకు సహకరించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు చిన్నారెడ్డి, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: 'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్.. మధురై వైద్యుడి ఘనత!