మరో మైలురాయి...
ఈవీఎంలనుతొలిసారి తయారు చేసింది హైదరాబాద్‌లోనేనని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా గుర్తుచేశారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు ఉన్నప్పటికీ ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా పోలింగ్ నిర్వహించడం కూడా ఎన్నికల చరిత్రలో నిలిచిపోయే మరో మైలురాయిగా ఉమేష్ సిన్హా ఉద్ఘాటించారు.
25వేల బ్యాలెట్ యూనిట్లతో...
రాష్ట్రంలో ఒక్కో పోలింగ్స్టేషన్లో 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు సిన్హా తెలిపారు. ఈ చొప్పున నిజామాబాద్‌లో మొత్తం 25వేల బ్యాలెట్ యూనిట్లు, 2 వేల కంట్రోల్ యూనిట్లు, 2వేల వీవీప్యాట్లు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో కలిపి 1788 పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ రేపు ఉదయం నుంచి ప్రారంభం అవుతుందన్న ఉమేష్ సిన్హా... రేపట్నుంచి ఈనెల 11 వరకు నిజామాబాద్‌లో 600 మంది ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని వెల్లడించారు.
ప్రత్యేక పరిశీలకులతో పర్యవేక్షణ...
పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు జాతీయ స్థాయి శిక్షకులు వస్తారని తెలిపారు. సెక్టోరల్ అధికారులు, సిబ్బంది సంఖ్యను పెంచుతామన్న ఉమేష్... 5 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టోరల్ అధికారి ఉంటారని చెప్పారు. నిజామాబాద్ పోలింగ్ కోసం ప్రత్యేక పరిశీలకులను నియమిస్తామని... ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉన్నందున పోలింగ్ విధానంపై ఓటర్లకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
తొలిసారిగా 12 యూనిట్లతో పోలింగ్...
ఇప్పటి వరకు గరిష్ఠంగా 4 బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ నిర్వహించామని... తొలిసారిగా 12 యూనిట్లతో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు మరో డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ అన్నారు. రేపు ఉదయానికల్లా యంత్రాలన్నీ నిజామాబాద్ చేరుకుంటాయని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
పటిష్ఠ బందోబస్తు నడుమ...
రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఈఓ రావత్, సీఎస్‌తో కేంద్ర ఎన్నికల సంఘ బృందం సమావేశం నిర్వహించింది. 145 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రానికి కేటాయించగా... నిజామాబాద్‌కు అదనపు బలగాలను పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి:దేశ చరిత్రలో నిజామాబాద్ ఎన్నికలు ఓ మైలురాయి