ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం నిజామాబాద్ జిల్లాలో నీరుగారుతోంది. ఇల్లు నిర్మించినా లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం వల్ల కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. అనేక చోట్ల ఇళ్లు మంజూరైనా నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఇక నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో వందల ఇళ్లు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా.. ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారులకు కేటాయించలేదు. దీంతో నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లు.. లోన లొటారం పైన పటారం అన్న చందంగా మారిపోయాయి. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు నిర్వహణ లేకపోవడం వల్ల.. శిథిలావస్థకు చేరుతున్నాయి. దీంతో అటు లబ్ధిదారులకు కేటాయించక.. అటు రక్షణ కల్పించలేక ఇళ్లన్నీ ఆకతాయిల చేతిలో ధ్వంసమవుతున్నాయి. మందు బాబులకు అడ్డాగా మారిపోయాయి.
నగర శివారులోని నాగారంలో జీ ప్లస్ 2 స్థాయిలో మొత్తం 35 భవనాలు నిర్మించారు. ఒక్కో భవనంలో 12 కుటుంబాలు ఉండేలా తీర్చిదిద్దారు. మొత్తం 420 మంది లబ్ధిదారుల కోసం ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. అయితే నిర్మాణాలు పూర్తయి ఏళ్లు దాటినా లబ్ధిదారులకు అప్పగించలేదు. గతంలో నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో పేదల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. దరఖాస్తుల విచారణ సైతం పూర్తి చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలనా జరిపారు. అయినా కేటాయింపులు మాత్రం జరగలేదు. దీంతో ఇళ్లన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయి. సీసీ కెమెరాలను అపహరించారు. అసాంఘిక కార్యక్రమాలకు అంతు లేకుండా పోతోంది. ఇప్పటికైనా ఇళ్లను తమకు అప్పగించాలని.. లబ్ధిదారులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందని తెలిసి.. సంతోషించిన పేద ప్రజలు ఇప్పుడు నిరాశ పడుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోవడం దారుణమని.. పలు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. అట్టహాసంగా కట్టి.. లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి నిర్మించి ధ్వంసమైన ఇళ్లను మరమ్మతులు చేయించి.. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి అప్పగించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: