మహబూబ్‌నగర్‌లో స్వచ్ఛంద సేవా సంస్థలు కొవిడ్ బాధితులకు చేయూతనిస్తున్నాయి. యువకులు ఆధ్యాత్మిక సేవా సంస్థలతో కలిసి హోంసోలేషన్‌లో ఉంటున్నవాళ్లకు బాసటగా నిలుస్తున్నారు. వైరస్ బారినపడి వంటకూడా చేసుకోలేని వాళ్లకు.. మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా వేడివేడి భోజనం అందిస్తూ దాతృత్వం చాటుతున్నారు. ఫోన్ చేసిన వారి ఇంటికే పంపిస్తూ ఆకలితీరుస్తున్నారు. "ఇంటి వద్దకు సాయి ప్రసాదం"కార్యక్రమంతో నిత్యం 300 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు.
ఫుడ్ బ్యాంక్
నవాబుపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన రవికి ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది. లాక్‌డౌన్ వల్ల మూత పడగా.. కొవిడ్ బాధితులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ప్రతి రోజు ఎంత మందికి భోజనం అవసరమో ఫోన్‌లో వివరాలు సేకరించి గ్రామగ్రామాన తిరిగి ఆహారం అందిస్తున్నారు.నిజామాబాద్ వినాయక్‌నగర్‌లోనూ యువకులు సేవాభావం చాటుతున్నారు. నవీన్ అతని మిత్రులు కలిసి 2016లో ఫుడ్ బ్యాంక్ ప్రారంభించారు. నగరంలోని మురికివాడలతో పాటు రోడ్లపైన ఉండే అనాథలు, యాచకులకు అన్నదానం చేస్తున్నారు. హోంఐసోలేషన్, హోంక్వారంటైన్, ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన వారికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
300 వందల మందికి ఉచితంగా భోజనం
ఫుడ్‌బ్యాంక్ బృందంలో సుమారు 60 మంది యువకులు స్వచ్చంద సేవలందిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా తోడ్పాటునందిస్తున్నారు. వ్యాన్ ద్వారా కరోనా రోగుల ఇళ్లకు వెళ్లి స్వయంగా ఆహారం అందిస్తున్నారు. రోజూ... రెండు పూటలా 300 వందల మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొవిడ్ బారిన పడిన బాధితుల ఆకలితీర్చడం తమ కర్తవ్యంగా భావిస్తున్నాని యువకులు చెబుతున్నారు. ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే మనల్ని ఎవరైనా ఆదుకుంటారనేదే సమాజానికి తామిచ్చే సందేశమంటున్నారు.
ఇదీ చదవండి: దొంగ నంబరు ప్లేట్లతో దర్జా.. వాహన యజమానులకు ఇబ్బందులు