నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లోని లాలన వృద్ధాశ్రమంలో 11 మంది కొవిడ్ బారిన పడ్డారు. ముగ్గురు అక్కడే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. మిగిలిన ఎనిమిది మందిలో నలుగురిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. మరో నలుగురు ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్నారు. మరొకరికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్ నగర శివారులోని ముబారక్‌నగర్ ఆలంబన వృద్ధాశ్రమంలో 26 మందికి కొవిడ్ నిర్ధారణ కాగా 11 మందిని ప్రైవేటు ఆసుపత్రుల్లో, 10 మందిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. నలుగురిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. లక్షణాలు లేని వారిని కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నారు.
పాలనాధికారి ఆదేశాలతో...
వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు కొవిడ్ సోకిందని తెలియగానే కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించారు. ఆలంబన వృద్ధాశ్రమాన్ని సందర్శించి, సౌకర్యం ఉన్నవారిని ఇళ్లకు, లేనివారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. లక్షణాలు లేనివారిని మాక్లూర్ ఐసోలేషన్ కేంద్రానికి పంపాలని సూచించారు. మూడు అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఆర్డీవో శ్రీనివాసులు, అధికారులు లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి, ఆశ్రమ వ్యవస్థాపకుడు రాజారెడ్డితో మాట్లాడి జాగ్రత్తలు వివరించారు.
కన్నబిడ్డల నిరాదరణకు గురైన తల్లిదండ్రుల హృదయ వేదనకు అద్దాలివి!!
* జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన వృద్ధుడు(96) ఆర్మూర్ మండలంలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. కొవిడ్ నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన కుమారుడికి నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. తీసుకెళ్లడానికి అంగీకరించకపోవడంతో ఆ వృద్ధుడిని ప్రభుత్వాసుపత్రికి పంపించారు.
* ఆర్మూరులోని వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఆదిలాబాద్‌కు చెందిన వృద్ధురాలికి(60) కరోనా పాజిటివ్ రావడంతో కుమారుడికి సమాచారం ఇచ్చారు. తాను హైదరాబాద్‌లో చిరు ఉద్యోగం చేస్తున్నాని.. అమ్మను వెంట తీసుకెళ్తే కష్టమవుతుందని చెప్పడంతో ఆశ్రమ నిర్వాహకులే ఆమెను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
* నిర్మల్ జిల్లాకు చెందిన వృద్ధురాలు(65) ఆశ్రమంలో ఉంటున్నారు. ఆమెకు మూడు రోజుల కిందట కరోనా వైరస్ సోకడంతో కుమారునికి సమాచారం ఇచ్చారు. వస్తానని చెప్పిన ఆయన సాయంత్రమైనా రాలేదు. ఆమెను ఆసుపత్రికి తరలించాక వచ్చారు. దవాఖానాలో ఉందని చెబితే అటువైపు వెళ్లకుండానే తిరుగుబాట పట్టారు.
ఇదీ చదవండి: 'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'